telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రైవేట్ భాగస్వామ్యం తప్పదంటున్న.. భారత బడ్జెట్..

private partnership with govt is compulsory budget line

ఆర్థిక వ్యవస్థ రూపాంతరీకరణలో ప్రైవేటు రంగం పాత్ర ఆవశ్యకత మరోసారి తెరపైకి వచ్చింది. ప్రగతిపై వాస్తవాలను వెల్లడిస్తూ, విధానాలపై పాలకులకు దిశానిర్దేశం చేస్తూ వార్షిక ఆర్థిక సర్వే ఆవిష్కృతమయింది. విధానాలను తరచూ మార్చకుండా, సుస్థిరత పాటించాలని శాసనకర్తలకు సర్వే సూచించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో 2018-19 సంవత్సరపు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఇది నూతన ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ రూపొందించిన తొలి సర్వే నివేదిక కావడం విశేషం. ఆ అంశాలను ఆయన విలేకరులకు వివరించారు.

ప్రస్తుత సంపదను రెట్టింపు చేసి 2024-25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరీకరణ చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఈ సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది. ఇందుకు భారీగా పెట్టుడులతో పాటు, పాలన రంగంలో సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఈ ఆశయ సాధనకు ప్రైవేటు రంగమే కీలకమని గుర్తించింది. ఈ భారీ లక్ష్యాన్ని అందుకోవాలంటే ఏటా 8 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంది. ఇది జరగాలంటే ‘పొదుపు, పెట్టుబడులు, ఎగుమతులు’ అనే ‘ధన వలయం’ ఏర్పాటు కావాలి. ప్రస్తుతం భారత్‌ 2.7 ట్రిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలో ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది బ్రిటన్‌ను పక్కన పెట్టి అయిదో స్థానానికి చేరనుంది.

సుస్థిర ప్రగతి సాధించాలంటే ప్రభుత్వం పెట్టుబడుదారుల అంచనాలకు అందేవిధంగా స్పష్టమైన విధానాలను రూపొందించాలి. అమలులో ఏకపక్ష ధోరణులు కనిపించనీయకూడదు. అస్పష్టతకు తావీయకుండా సరైన మార్గదర్శనం చేయాలి. ‘అస్పష్ట విధానాల సూచి’ని రూపొందించి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలి. విధానాల్లో సుస్థిరత ఉండాలంటే వాటికి చట్టబద్ధత కల్పించాలి. ప్రైవేటు సంస్థలు నాణ్యత ధ్రువీకరణ పత్రాలను పొందడానికి పోటీ పడుతున్నట్టుగానే, ప్రభుత్వ సంస్థలూ ప్రయత్నించాలి. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రైవేటు రంగమే కీలక చోదక శక్తి అని సర్వే అభిప్రాయపడింది. మార్కెట్‌లో డిమాండు పెరుగుదల, సామర్థ్యం పెంపుదల, కార్మికుల ఉత్పాదకశక్తిలో మెరుగుదల, నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలు, ఉద్యోగాల కల్పన, ‘సృజనాత్మక విధ్వంసం’ చేపట్టడంలో ప్రైవేటు రంగం కీలకంగా వ్యవహరిస్తుంది. కార్మిక రంగంలో సంస్కరణలు ప్రారంభించాలి. గృహ వినియోగ వస్తువుల డిమాండు పెరిగేందుకు ప్రోత్సాహకర ఆర్థిక విధానాలను అనుసరించాలి.

Related posts