telugu navyamedia
రాజకీయ

కొనసాగుతోన్న కౌంటింగ్ రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్‌..’ముర్ము’ విజయం లాంఛనమే

భారత అత్యున్నత స్థానం రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ పార్లమెంటులోని 63వ నంబర్ గదిలో కొనసాగుతోంది. భారత అత్యున్నత తదుపరి రాష్ట్రపతి ఎవరో అనేది మ‌రి కొద్ది గంట‌ల్లో తేల‌నుంది.

అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి పీఠం కోసం ముఖాముఖి తలపడ్డారు.

రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్‌ హౌస్‌తో పాటు 31 చోట్ల, అసెంబ్లీ పరిధిలోని 30 కేంద్రాల్లో ఓటింగ్‌ జరిగింది. అనేక రాష్ట్రాల్లో ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముర్ము విజేతగా నిలిస్తే.. రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.

ముర్ము నివాసంలో అప్పుడే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోన్న వేళ ముర్ము నివాసం సందడి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఒడిశా మయూర్‌భంజ్‌లోని రాయ్‌రంగ్‌పూర్‌ పట్టణంలో ఇప్పటికే పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జానపద కళాకారులు, గిరిజన నృత్యకారులు ఇప్పటికే వీధుల్లోకి చేరి ప్రదర్శనలు ఇస్తున్నారు. బైక్‌ ర్యాలీలు, మిఠాయిల పంపిణీ కూడా ఉందని వెల్లడించారు.

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓటింగ్‌ ఈ నెల 18న పార్లమెంటు భవనంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. సంబంధిత బ్యాలెట్‌ పెట్టెలన్నీ ఇప్పటికే పార్లమెంటు హౌస్‌కు చేరుకున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికకు ప్రధాన రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాలెట్‌ పేపర్లను వేరు చేస్తారు. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ వెంటనే పి.సి.మోదీ ఫలితం సరళిని మీడియాకు తెలియజేస్తారు. ఆపై ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

10 రాష్ట్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి, 20 రాష్ట్రాల కౌంటింగ్‌ ముగిశాక మరోసారి ప్రధాన రిటర్నింగ్‌ అధికారి ఫలితం సరళిని వెల్లడిస్తారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ ఎన్నికలో ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా నిర్ణయించారు. ఎమ్మెల్యేల ఓటు విలువ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది.

ఇదిలావుంటే.. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10,69,358 ఓట్లకు గాను కోవింద్ 7,02,044 ఓట్లతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి మీరా కుమార్‌కు 3,67,314 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే అని చెప్పాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలిస్తే దేశంలోనే తొలి గిరిజన మహిళ అధ్యక్షురాలిగా అవతరిస్తారు.

15 ఏళ్ల క్రితం ఈరోజు జూలై 21న దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ప్రతిభా దేవిసింగ్ పాటిల్ ఎంపికయ్యారు. 21 జూలై 2007న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతిభా దేవిసింగ్ పాటిల్ విజయం సాధించారు. ఆ తర్వాత 2007 జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Related posts