telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : …రాష్ట్ర వ్యాప్తంగా .. క్యాన్సర్ పరీక్షలు..

precautionary cancer tests in telangana

టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. రాష్ట్రంలో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 60 శాతం వరకు నమోదు అవుతున్నాయి. నోటి క్యాన్సర్ ఆ తరువాత స్థానంలో ఉంది. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతుంది. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఇళ్ల దగ్గరే నోటి, రొమ్ము క్యాన్సర్ పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటికీ క్యాన్సర్ పరీక్షలను 12 జిల్లాల్లో మొదట నిర్వహించటానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నవారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే క్రయో థెరపీ అనే తొలి దశ చికిత్స కూడా అందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే వైద్యులకు మరియు నర్సులకు ఎం ఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 30 ఏళ్లు పైబడిన 38.73 లక్షల మందికి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేట, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో తొలిదశలో పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 30 మంది చొప్పున వారానికి ఐదు రోజుల పాటు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. రొమ్ము క్యాన్సర్ గా ప్రాథమికంగా సందేహించిన వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరోసారి పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కొరకు ఎం ఎన్ జే ఆసుపత్రికి తరలిస్తారు.

Related posts