telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

విశాఖ వేదికగా టెస్ట్‌ మ్యాచ్‌ కు .. నేటినుండి ప్రాక్టీస్ మ్యాచ్ లు..

practice matches in vishaka

విశాఖ వేదికగా రెండోసారి టెస్ట్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. గతంలో ఇంగ్లండ్‌తో భారత్‌ జట్టు పిఎంపాలెం ప్రాంతంలోని ఎసిఎ-విడిసిఎ మైదానం వేదికగా టెస్ట్‌ మ్యాచ్‌ ఆడి విజయం సాధించింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు మరోసారి దక్షిణాఫ్రికాతో అదే మైదానంలో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎసిఎ పూర్తి చేస్తుంది. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఐదు రోజులు పాటు తొలిటెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ఎసిఎ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పిచ్‌ తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న దక్షిణాఫ్రికా, బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ జట్ల ఆటగాళ్లు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాక్టీసు చేయలేకపోయారు. దీంతో నేరుగా ఈ రెండుజట్లు గురువారంనుండి ప్రారంభం కానున్న మూడు రోజులు పాటు విజయనగరంలో ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనున్నాయి. బోర్డు ఎలెవన్‌ జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా విశాఖకు చెందిన శ్రీకర్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 సిరీస్‌ డ్రా కావడంతో విశాఖ వేదికగా ప్రారంభం కానున్న టెస్ట్‌ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

విశాఖ వేదికగా తొలిసారి టెస్టు ఆడుతున్న సఫారీలు కూడా విజయం సాధించాలని ఉవ్విల్లూరుతున్నారు. ఈ టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల విక్రయాలను సెప్టెంబర్‌ 15 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఒక రోజుకు రూ.100, 200, 300, 500 కాగా, ఐదు రోజులకు గాను రూ.400, 800, 1000, 1500గా నిర్ణయించారు. ప్రతి రోజూ 2వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ మైదానంలో 21 ప్రవేశ ద్వారాలు అందుబాటులో ఉండగా ప్రేక్షకులకు కేవలం 12 గేట్లు ద్వారానే ప్రవేశం కల్పించనున్నారు.

Related posts