telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రేవంత్ అభిమానులు నన్ను క్షమించాలి: పోసాని

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై నటుడు పోసాని కృష్ణ మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో పోసానిపై రేవంత్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడిన పోసాని వంద శాతం నిజాయతీపరుడైన కేటీఆర్ పై రేవంత్ దుష్ప్రచారం ఏంటని ప్రశ్నించారు. దీంతో రేవంత్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో పోసానిని తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో పోసాని స్పందిస్తూ రేవంత్ పై తాను ఎటువంటి చెడు వ్యాఖ్యలూ చేయలేదని వివరణ ఇచ్చారు.

రేవంత్ అభిమానులు, కార్యకర్తలు ఎవరైనా బాధపడివుంటే తనను క్షమించాలని అన్నారు. తాను తప్పుచేసుంటే, సరిదిద్దుకుంటానని చెబుతూ, ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.తన వ్యాఖ్యల ద్వారా రేవంత్ అభిమానులు మనస్తాపం చెందారని తనకు తెలిసిందని, తాను తెలిసి ఈ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నడూ రేవంత్ ను విమర్శించలేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు విమర్శించే సమయంలో సంబంధిత సాక్ష్యాలు కూడా ఉంచుకోవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై అభిమానులకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

Related posts