అమెరికా న్యూస్ మ్యాగజైన్ ‘టైమ్’ తాజా సంచిక కవర్ పేజీపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ప్రచురించింది. భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తరుణంలో టైమ్ మ్యాగజైన్ మోదీపై కథనాలు ప్రచురించింది. వాటిలో ఒకటి ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అనే పేరుతో కాస్తంత వివాదాస్పద ఛాయల్లో ఉండగా, మరొకటి ‘మోదీ ది రిఫార్మర్’ పేరుతో సానుకూలంగా కనిపిస్తోంది.
‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అనే వ్యాసాన్ని ప్రముఖ భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ తనయుడు ఆతిష్ తసీర్ రచించగా, ‘మోదీ ది రిఫార్మర్’ కథనాన్ని యూరేషియా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇయాన్ బ్రెమర్ రాశారు. ఆతిష్ తశీర్ తన విమర్శనాత్మక వ్యాసంలో, బలహీన ప్రతిపక్షం ఉండడం మోదీకి కలిసొచ్చిందని పేర్కొన్నారు. ‘భారతదేశ ప్రధాన విభజనకారి’ అన్న శీర్షికతో మోదీ ఫొటో ను ‘టైమ్’ మ్యాగజైన్ కవర్‌పేజీపై ముద్రించింది.