telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చెట్టుపై ల్యాండైన విమానం…!?

Plane

అవునండీ… నిజంగానే చెట్టుపై ల్యాండ్ అయ్యింది ఓ విమానం… విమానంలో సాంకేతిక లోపం రావడంతో అమెరికాలో జాన్ గ్రెగొరి అనే పైలట్ అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన అవసరం రాగా చాకచక్యంగా విమానాన్ని ఓ చెట్టుపై ల్యాండ్ చేశాడు. పైపర్ కబ్ పీఏ-18 అనే సింగిల్ ఇంజిన్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా పవర్ పోయింది. ఇదే సమయంలో విమానాన్ని భూమిపై ల్యాండ్ చేయాలని పైలట్ జాన్ నిశ్చయించుకున్నాడు. అదే సమయంలో వెళ్తున్న దారిలో 60 అడుగుల చెట్టు విమానానికి తగలడంతో వెంటనే విమానాన్ని ఆ చెట్టుపై చాకచక్యంగా ల్యాండ్ చేయగలిగాడు. విమాన రెక్క కింద ఉండే స్టట్ చెట్టులో సరిగ్గా ఇరుక్కోవడంతో విమానం కింద పడకుండా ఆగగలిగింది. వెంటనే 911కు ఫోన్ చేసిన జాన్ జరిగిన విషయాన్ని అధికారులకు వివరించాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఓ ట్రీ రిమూవల్ కంపెనీ వాలంటీర్ ర్యాండీ అకర్ చెట్టుపై విమానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చెట్టు పైకి ఎక్కి అక్కడ ఏం జరుగుతుందో చూడాలని కుతూహలంతో చెట్టు ఎక్కాడు. చెట్టు కాండాలను తొలగిస్తూ దాదాపు విమానానికి 20 అడుగుల దూరంలో ఆగి విమానం కింద పడకుండా తాడుతో చెట్టుకు చుట్టి పైలట్ జాన్‌ జాగ్రత్తగా కిందకు దిగేలా సహాయపడ్డాడు. తన జీవితంలో ఇటువంటి దృశ్యం ఎన్నడూ చూడలేదని.. జాన్‌కు సహాయపడినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో విమానం చెట్టుపై ల్యాండ్ అవ్వగా.. గురువారం మధ్యాహ్నం వరకు విమానం అలానే చెట్టుపై ఉన్నట్టు అధికారులు చెప్పారు. 

Related posts