telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

ఫోన్ పే అదిరిపోయే ఫీచర్… ఏటీయం లేకుండా నగదు విత్ డ్రా

Phone-Pay

డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే గురువారం తన ప్లాట్‌ఫామ్‌లో ‘ఫోన్‌పే ఏటీయం’ అనే ప్రత్యేక ఫీచర్ ను తీసుకువచ్చింది. నగదు అవసరం ఉన్న వినియోగదారులు తమకు సమీపంలో ఉన్న వ్యాపారుల నుంచి డబ్బును పొందేలా సాయపడుతుంది. అంటే మీకు నగదు కావాలనుకుంటే ఫోన్ పే యాప్ ద్వారా దగ్గరలో ఉన్న వ్యాపారుల నుంచి నగదును పొందవచ్చన్న మాట. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ-ఎన్సీఆర్ లో మాత్రమే ప్రారంభించారు. త్వరలో దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఫీచర్ ను ఉపయోగించి ప్రస్తుతానికి కేవలం రూ.1,000 నగదును మాత్రమే తీసుకోగలం. త్వరలో ఈ మొత్తాన్ని కూడా పెంచుతారేమో చూడాలి మరి! మీరు ఎప్పుడైనా ఏటీయం మరిచిపోయి బయటకు వెళ్లినప్పుడు, లేకపోతే మీ చుట్టుపక్కల ఏటీయంలు లేనప్పుడు ఈ ఫీచర్ ను ఉపయోగించుకుని మీరు నగదును పొందవచ్చు. ఫోన్‌పే ఏటీయం వినియోగదారులకు విశ్వసనీయ వ్యాపార భాగస్వాముల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా నగదును ఉపసంహరించుకునే వీలును కల్పిస్తున్నామని ఫోన్ పే ఈ సందర్భంగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సేవను పొందటానికి వినియోగదారులు, వ్యాపారుల నుంచి ఫోన్ పే ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. అయితే విత్ డ్రా లిమిట్ మాత్రం.. ఆయా బ్యాంకులు నిర్దేశించిన విత్ డ్రా లిమిట్ కు లోబడి ఉంటాయి.

దీన్ని ఉపయోగించాలంటే కింద తెలిపిన ప్రక్రియను అనుసరించండి.
ముందుగా మీ ఫోన్ లో ఫోన్ పే యాప్ ను ఓపెన్ చేయండి.
పక్కనే ఉన్న స్టోర్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి
అందులో ఉన్న ఫోన్ పే ఏటీయం ఐకాన్ పై క్లిక్ చేయండి.
వెంటనే అక్కడ మీకు అందుబాటులో నగదును అందించే స్టోర్స్ కనిపిస్తాయి.
ఆ స్టోర్ కు వెళ్లి విత్ డ్రా బటన్ పై క్లిక్ చేయండి.
మీ ఫోన్ పే యాప్ ద్వారా ఆ వ్యాపారికి మీకు అవసరమైన మొత్తాన్ని చెల్లిస్తే అతను మీకు ఆ మొత్తానికి సమానమైన డబ్బును అందిస్తారు.

Related posts