telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పౌరసత్వ చట్టం పై … దాఖలైన పిటిషన్ల విచారణ..

Supreme Court

ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లను బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణ చేయనుంది. ఈ ధర్మాసనంలో సభ్యులుగా జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు కూడా ఉన్నారు. ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అత్యున్నత న్యాయస్థానం మొత్తం 140 పిటిషన్లను ఒకేసారి విచారణ చేయనుంది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌లతో పాటు మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఉన్నారు. ఇక జనవరి 10 నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంపైన కూడా స్టే కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ బద్దమే అని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టం రూపుదాల్చాకా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్న న్యాయస్థానం దేశంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించింది. ఇదిలా ఉంటే సీఏఏ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వంను చట్టం ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది ఐయూఎంఎల్. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడాన్ని ఆ సంస్థ తప్పుబట్టింది.

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 12న ఆమోద ముద్రవేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఇక చట్టం అమలుపై మధ్యంతర స్టేను కోరుతూ ఐయూఎంఎల్ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగ సూత్రాలకు సీఏఏ విరుద్ధంగా ఉందని ఐయూఎంల్ పేర్కొంది. అంతేకాదు ముస్లింల పట్ల వివక్ష చూపుతూ కేంద్రం చట్టంను తీసుకొచ్చిందని పిటిషన్‌లో తెలిపింది. ముస్లింయేతర వారికి మాత్రమే పౌరసత్వం కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని వాదించింది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా కేంద్రం పౌరసత్వసవరణ చట్టంను తీసుకొచ్చిందని కాంగ్రెస్ నేత జైరాంరమేష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సమానం అసమానత్వాలు ఈ చట్టంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు భారత పౌరసత్వం పొందాలంటే మతప్రాతిపదికన జరగడం సరికాదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు 1955 పౌరసత్వ సవరణ చట్టంకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉందని చెప్పారు. పౌరులను మత ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన వేరు చేసేలా చట్టం ఉందని చెప్పిన జైరాం రమేష్.. ఇతర దేశాల్లో మతపరమైన అణిచివేతకు గురైన వారికి భారత పౌరసత్వం ఇవ్వాలంటే ఈ పద్ధతి సరైనది కాదని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు.

Related posts