telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బోటు ప్రమాద సమయంలో .. కాపాడిన వారికి .. 25 వేలు ప్రోత్సహక నగదు..

people rescue on boat accident got prize money

కచ్చులూరు వద్ద బోటు మునిగిన సంఘటనలో అక్కడి గిరిజనులు ఎంతో సహసం చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. వారు ప్రదర్శించిన ధైర్యానికి చేసిన సహాయానికి వారికి ప్రభుత్వం ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ బోటు ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన అని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశంలో ఇంతవరకు ఇంత లోతులో ఉన్న లాంచీని ఎప్పుడు చూడలేదని, ఒక వేళ ఎవరైనా తీస్తామని ముందుకు వస్తే ప్రభుత్వం సహకారం తప్పక వారికి అందిస్తుందని చెప్పారు. ఈ సంఘటన జరిగిన వెంటనే కచ్చులూరి గ్రామస్తులు కొంత మంది ఒడ్డు నుంచి చూసి ప్రమాదంలో ఉన్న 26 మందిని కాపాడారని చెప్పారు. వారిని సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారని చెప్పారు.

ఆ రోజు నేర్పుతో సాహసం చేసి ఎవరెవరు ప్రయాణికులను కాపాడారో వారికి నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.25 వేలు ప్రోత్సహక నగదు ఇస్తున్నామన్నారు. వారి సహసం 26 మంది ప్రాణాలు కాపాడిందని, వారికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. బోటు ప్రమాదంలో మరణించిన వారికోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అండగా వుంటూ సహాయ సహకారాలు అందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికి ఆచూకీ లభ్యం కాని వ్యక్తులకు సంబంధించి డెత్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని బాధితుల బంధువులు కోరుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘటనలోని బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడిందని గుర్తు చేసారు.

Related posts