telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పెన్షన్‌ సంస్కరణల పై రోడ్డెక్కిన .. ఫ్రాన్స్ ప్రజానీకం..

pension issues in france

ఫ్రాన్స్‌ దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె మంగళవారం ఆరో రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పెన్షన్‌ సంస్కరణలను సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ అంశంపై పెరుగుతున్న ప్రజల ఆగ్రహానికి అడ్డుకట్ట వేసేందుకు కార్మిక సంఘాలతో మరింత విస్తృతంగా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. దాదాపు గత నెల రోజులుగా వివిధ కార్మిక సంఘాలతో జరుపుతున్న సంప్రదింపులను ఒక కొలిక్కి తెచ్చేందుకు సోమవారం నాడు ప్రభుత్వ పెన్షన్ల హై కమిషనర్‌ జీన్‌పాల్‌ దళవారు, ఆరోగ్యశాఖ మంత్రి ఆగెస్‌ బుంజిన్‌ పలు కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం దళవారు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై యధాతథ స్థితి ఎంతో కాలం కొనసాగదని, భావితరాలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయటం కోసం ఈ ప్రాజెక్టు అవసరమని అన్నారు. చర్చల్లో తమ ముందుకు వచ్చిన డిమాండ్లలో సమత, సంఘీభావం ప్రాధాన్యతాంశాలుగా మారాయని వివరించారు. ఇప్పటికీ ఇరువర్గాలలో విభేదాలు కొనసాగుతున్నందున సంప్రదింపులు వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయన్నారు.

కార్మిక సంఘాలు తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని ఎడురాడో పిలిప్‌ పెన్షన్‌ సంస్కరణల పూర్తి స్వరూప స్వభావాలను బుధవారం నాడు ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంస్కరణలు ఎటువంటి కాఠిన్యానికి తావులేకుండా, పూర్తి ప్రగతిదాయకంగా ఉంటాయని ఆయన భరోసా ఇస్తున్నారు. పెన్షన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు మలి దశ ఆందోళనలకు పిలుపునివ్వటంతో పరిస్థితిపై చర్చించేందుకు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ మంగళవారం నాడు అధికార రిపబ్లిక్‌ ఆన్‌ మూవ్‌ పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. ప్రధాని ప్రతిపాదిస్తున్న పెన్షన్‌ సంస్కరణల్లో కార్మికులు దశాబ్దాల తమ పోరాటాలతో సాధించుకున్న హక్కులను రద్దు చేయటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెన్షన్‌ వ్యతిరేక ఆందోళనల ఉధృతితో సోమవారం నాడు దేశవ్యాప్తంగా రైలు, మెట్రో సర్వీసులకు వరుసగా ఐదో రోజు అంతరాయం కలిగింది. గత గురువారం నుండి కొనసాగుతున్న ఈ సమ్మెను మంగళవారం నాడు దేశవ్యాప్త ర్యాలీలతో ముగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా దాదాపు 8.06 లక్షల మంది కార్మికులు పాల్గంటున్నట్లు అధికారిక అంచనాలు చెబుతున్నాయి.

Related posts