telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో.. చేతికే పింఛన్లు .. భోజనాలు పెట్టి మరీ..

ఇటీవల పింఛన్ల గురించి ఏపీసీఎం ప్రకటనకు బాగా స్పందన రావడంతో టీడీపీ పార్టీ వర్గాలలో ఉత్సాహం వచ్చేసింది. దీనితో ‘సార్వత్రిక ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు అమలు చేసిన ఈ నిర్ణయం ప్రజల మనసును మార్చేసింది. మమ్మల్ని ముందు నిలిపింది’ అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పేదల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తిపని వారికి ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తూ సీఎం చంద్రబాబు కొద్ది రోజుల కిందట నిర్ణయం ప్రకటించారు. వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం నెలకు రూ.1000 వంతున ఇస్తున్న పింఛన్‌ను రూ.2000 చేశారు. వికలాంగులకు రూ.1500వంతున ఇస్తున్న మొత్తాన్ని రూ.3000 చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో ఇటువంటి పింఛన్లు పొందుతున్న వారు 54లక్షల మంది ఉన్నారు. కొత్తగా మరో 3లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

పింఛన్లను ఐదేళ్లలో రెండు దఫాలు పెంచడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా పెంపు ప్రకటించినా వచ్చే ఏప్రిల్‌ నుంచి దానిని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి రూ.ఆరున్నర వేల కోట్లుగా ఉన్న పింఛన్ల ఖర్చు పెంచిన తరువాత ఏడాదికి రూ.13 వేల కోట్లకు చేరనుంది. సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. ఆకస్మికంగా నిర్ణయం ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం క్షేత్ర స్థాయిలో బలమైన ప్రభావం చూపిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘అధికారంలో ఉన్న పార్టీపై రకరకాల అసంతృప్తులు ఉండటం సహజం. ఈ నిర్ణయం అటువంటి అసంతృప్తులను పక్కకు తోసేసింది.

పెంచిన పింఛన్లను పండగ వాతావరణంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకూ ప్రతి గ్రామం, వార్డులో లబ్ధిదారులకు పెంచిన మొత్తాన్ని స్వయంగా చేతికి అందచేయాలని అధికార వర్గాలను ఆదేశించారు. వారికి భోజనం పెట్టి మరీ ఇవ్వాలని, దీనివల్ల వారిని ఆదరంగా చూసుకొన్నట్లు అవుతుందని నిర్ణయించారు. సీఎం సందేశాన్ని కూడా వారికి అందించాలని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలను సీఎం ఆదేశించారు.

Related posts