telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో 2430 జీవో రద్దు చేసితీరాలి.. ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఆదేశాలు..

pci orders to AP govt to cancel 2430 GO

ఏపీప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించేలా జారీ చేసిన 2430 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. జీవో జారీపై కౌన్సిల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌ అధ్యక్షతన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో విచారణ జరిగింది. ఏపీ నుండి జర్నలిస్టు సంఘ నేతలు విచారణలో పాల్గొన్నారు. జీవోకు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని, దీనివల్ల వార్త మంచిదా? చెడ్డదా? అని చూడకుండా ఎడాపెడా కేసులు పెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందంటూ గతంలో జయలలిత ప్రభుత్వ హయాంలో కేసుల నమోదును ఉదహరించారు.

ఇదే విచారణకు ప్రభుత్వం నుండి సమాచార, పౌరసంబంధాల శాఖ తరఫున అదనపు డైరెక్టర్‌ కిరణ్‌ తమ వాదనను కౌన్సిల్‌కు వివరించారు. జీవోను దుర్వినియోగం చేయబోమని చెప్పారు. కేవలం దురుద్దేశ పూర్వక వార్తల నియంత్రణ కోసమే ఈ జీవో తెచ్చామని..ఏ మీడియా సంస్థను ఉద్దేశించి తెచ్చిన జీవో కాదంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణ సైతం ఇదే విధంగా ఉంది. ఈ జీవో ద్వారా ఎవరికీ నష్టం లేదని..ఎవరు ఏం రాసినా భరించాలా అంటూ సీఎం ప్రశ్నించారు. అయితే. అటు జర్నలిస్టు సంఘాలు..ఇటు ప్రభుత్వం వాదనలు విన్న తరువాత ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 ను ఉప సంహరించుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) చైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌ ఆదేశించారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం దీని పైన ఏరకంగా వ్యవహరిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Related posts