telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జగ్గారెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశం.. అందుకేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనతో భేటి అయ్యారు.

ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు బహిరంగంగా కలుసుకుని మాట్లాడుకోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సమావేశం అనుకోకుండా జరిగిందా ? లేక రేవంత్ రెడ్డి స్వయంగా జగ్గారెడ్డిని కలిసేందుకు వచ్చారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జరుగుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు ఒకరికొకరు ఎదురెదురుగా తారసపడ్డారు. దీంతో పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఒకరికొకరు కరాచలనం చేసుకుని మీడియా ప్రతినిధులకు ఫోజులిచ్చారు. అంతేకాకుండా ఆ తర్వాత ఇద్దరు నేతలు సుమారు 20 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. అయితే తాము ఏం మాట్లాడామో చెప్పబోమని జగ్గారెడ్డి వెల్లడించడం గమనార్హం.

అయితే రోజురోజుకు కాంగ్రెస్‌ దేశంలో బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గురువారం వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతవడంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోనూ ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని చాలామంది భావిస్తున్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి సీనియ‌ర్ నేత‌లు కాంగ్రెస్‌ను వీడతారేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్న నేపథ్యంలో..జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగార‌నేది పలువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు

 

Related posts