telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వలస కార్మికులపై లాఠీచార్జి బాధాకారం: పవన్ కల్యాణ్

pawan

వలస కార్మికుల బాధలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో కాలినడకన స్వస్థలాలకు వెళ్లే క్రమంలో వారు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, మరికొందరు మార్గమధ్యంలో అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించాలని సూచించారు.అన్ని రాష్ట్రాల యంత్రాంగాలు సమన్వయంతో వ్యవహరిస్తే వలస కార్మికుల సమస్యలు తీరతాయని అన్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద వలస కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని అన్నారు. మైళ్ల తరబడి నడుస్తూ, సైకిళ్లు తొక్కుతూ వస్తున్న వారి వేదనను అధికారులు, పోలీసులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు.వలస కార్మికుల చెమట చుక్కలే రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిలో కీలకంగా ఉన్నాయన్న విషయాన్ని విస్మరించరాదని పవన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఒడిశా, అసోం, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందినవారు పనిచేస్తున్నారని, ప్రకాశం జిల్లా గ్రానైట్ పరిశ్రమల్లో ఒడిశా కూలీలు పనిచేస్తున్నారని వివరించారు.

Related posts