telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

30 నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు

tirumala temple

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిఏడాది శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. జూలై 30వ తేదీన పవిత్ర ప్రతిష్ట, జూలై 31న పవిత్ర సమర్పణ, ఆగస్టు 1న పూర్ణాహుతి నిర్వహిస్తారు. బుధవారం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సంవత్సరం అంతా ఆలయంలో జరిగే ఉత్సవాలు, వేడుకలు, అర్చనలు, ఉత్సవాలు జరిగే సమయంలో భక్తుల వల్ల, సిబ్బంది వల్ల తెలిసి తెలియకుండా కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ వేడుకలను నిర్వహించడం టీటీడీకి ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9నుంచి 11గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయక మండపంలో వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవాలను సాలువ నరసింహా రాయల కాలంలో సాలువ మల్లయ దేవరాజ 1463లో తొలిసారిగా నిర్వహించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తోంది. అనంతరం 16వ శతాబ్దం వరకు కొనసాగినట్లు ఆధారాలున్నాయి. తర్వాత 1962లో ఈ ఉత్సవాలను టీటీడీ పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఏటా క్రమంతప్పకుండా ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

Related posts