telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నాది సామాన్యుల సేన ..: పవన్ కళ్యాణ్

pavan kalyan with common people sena

పవన్‌కళ్యాణ్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై వస్తున్న దుష్ప్రచారాలు చెక్ పెట్టేందుకు ఆయన తన పార్టీ అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. ఆయన కొందరు సామాన్యులను రాజకీయ యవనికపై నిలబెట్టారు. ఏ హంగూ, ఆర్భాటం లేని వారు, సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వారిని ఎంపిక చేసి పార్టీ టిక్కెట్లు కేటాయించారు. పార్టీలో మొదటి నుంచి నిలబడిన వారితో పాటు సామాజిక అంశాలపై దృష్టి సారించిన సామాన్యులను ఆయన ఎంపిక చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, పాతపట్నం, ఇచ్ఛాపురం, విజయనగరం జిల్లా పార్వతీపురం, నెల్లూరు అర్బన్‌, కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా కదిరి, కర్నూలు జిల్లా నందికొట్కూరు తదితర మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఈ కోవలోకి వస్తారు. నామినేషన్ల ప్రక్రియలో వారి వెంట స్థానిక యువకులు స్వచ్ఛందంగా వెంట నడిచారు.

* శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువకుడు చైతన్య. సామాజికాంశాలపై చైతన్యం నిండిన వాడు. అతను విశ్రాంత కండక్టరు కొడుకు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నవాడు. ఉద్దానం కిడ్నీ సమస్య, వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై తన పరిశీలనాంశాలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తెచ్చారు. పవన్‌ ఉద్దానం సమస్యపై నడుం బిగించటానికి పరోక్షంగా కారణమయినవాడు.

* ఆమదాలవలస జనసేన అభ్యర్థి పేడాడ రామ్మోహనరావు చిన్న రైతు కుటుంబానికి చెందిన వారు. ఉన్న భూమి కూడా తక్కువే. పొక్లయిన్ల సరఫరాలో మధ్యవర్తిగా ఉండి ఉపాధి పొందుతుంటారు. మొదటి నుంచి జనసేనతో కలసి సాగుతున్నారు.

* శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాసరి రాజు చిన్న స్కూలు నడుపుతున్నారు. మొదటి నుంచి పవన్‌ కల్యాణ్‌ అభిమాని. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఆయనకు ఇచ్ఛాపురం టిక్కెట్‌ లభించింది.

* నెల్లూరు అర్బన్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేతంరెడ్డి వినోద్‌రెడ్డి సామాజిక కార్యకర్త. ప్రజా సమస్యలపై మొదటి నుంచి పోరాడేతత్వం ఉన్నవారు. మొదట్లో యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన వినోద్‌ ‘సేవ్‌ నెల్లూరు’ పేరిట కార్యక్రమం చేపట్టి డంపింగ్‌ యార్డు, డ్రైనేజి కాలుష్యం తదితర సమస్యలపై పోరాటం చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే తత్త్వం ఉన్నవారు.ఫ్లెక్సీలు ముద్రించే వ్యాపారం ఉంది. అందులో వచ్చే ఆదాయంతో సేవాకార్యక్రమాలు చేపడతారు.

* విజయనగరం జిల్లా పార్వతీపురం అభ్యర్థి సి.గౌరీశంకర్‌రావు వ్యవసాయకూలీ కుమారుడు. బీఎస్పీ, బీఈడీ చదివారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన తల్లి కూరగాయలు అమ్ముతుంటారు. జనసేన పార్టీ నిర్వహించిన యంగ్‌ లీడర్‌షిప్‌ కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.

* కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి పోటీ చేస్తున్న బాల వెంకట్‌ పశువైద్యాధికారిగా పని చేస్తూ, జనసేన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఉద్యోగంలో కొనసాగుతూ పార్టీకి వీలయినంత సహకారం అందించమని పవన్‌ కల్యాణ్‌ సూచించినా, రాజకీయాలపట్ల ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయనకు నందికొట్కూరు టిక్కెట్‌ లభించింది.

* కడప జిల్లా మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న పి.మల్హోత్రా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చిన్న ఉద్యోగి. సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఉద్యోగం వదిలి పార్టీ కార్యకలాపాలపై ఆసక్తి చూపడంతో మైదుకూరు నుంచి బరిలో నిలిపారు.

Related posts