telugu navyamedia
రాజకీయ

ముగిసిన రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌..ఏపీ తెలంగాణ‌లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీరే..

భార‌త అత్యున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ ఓటేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వీల్​ఛైర్​లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పార్లమెంట్‌లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పోటీ చేశారు.

ముర్ముకు అధికార బీజేపీతో పాటు ఎన్డీయే పక్షాలు మద్దతిచ్చాయి. ఎన్డీయేతర పార్టీలైన బిజూ జనతాదళ్, శివసేన, అకాళీదళ్ కూడా మద్దతు ప్రకటించాయి. దీనికి తోడు ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. అనేక రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేశారు.

కాగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. తెలంగాణలో మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటు హక్కును వినియోగించుకోనివారిలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌లు ఉన్నారు.

అయితే ఇందులో గంగుల కమలాకర్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆయన ఓటు వేసేందుకు రాలేదు. అయితే చెన్నమనేని రమేష్‌ ఓటు వేసేందుకు దూరంగా ఉండటానికి గల కారణం మాత్రం తెలియరాలేదు.

అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార వైసీపీ చెందిన 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 174 ఓట్లు పోల్ అవ్వాల్సి ఉండగా.. టీడీపీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేదు.

టీడీపీ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి విదేశాల్లో ఉండటం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుకోలేకపోయారని తెలిసింది.

ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 44 పార్టీలు మద్దతిచ్చాయి. 63 శాతానికి పైగా మెజార్టీతో ముర్ము విజయం సాధించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఈనెల 21 ఫలితాలు వెలువడతాయి

Related posts