telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దాడులకు సిద్దపడండి అంటున్న పాక్ .. సైన్యం చేతిలో కీలుబొమ్మగా ఇమ్రాన్..

shied pak pm imran khan

పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి నోరుజారాడు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌-370ని మోదీ సర్కారు రద్దు చేయడం భారత్‌-పాక్‌ మధ్య సంప్రదాయ యుద్ధానికి దారితీయొచ్చని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి-14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్‌లో మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందన్నారు. కశ్మీరీలను ఎంత అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే, తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారన్నారు. పాక్ పార్లమెంట్‌ ఉభయ సభలు జమ్మూకశ్మీర్‌ సమస్య, ఆర్టికల్‌ 370 రద్దు పై హుటాహుటిన సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ,బీజేపీని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీది జాత్యహంకార సిద్ధాంతమని.. ఆ పార్టీకి హిందువుల ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించడమనే తమ వ్యవస్థాపకుల జాత్యహంకార సిద్ధాంతానికి అనుగుణంగానే బీజేపీ పనిచేస్తోందన్నన్నారు.

కశ్మీర్‌ విషయంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలకూ భారత్‌ పాతరేసిందన్నారు. ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళతామని.. వీలున్న ప్రతిచోటా ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వ్యతిరేక చర్యలను దునుమాడాలని పిలుపునిచ్చారు. అయితే సంయుక్త పార్లమెంటరీ సమావేశం అజెండానే ఇమ్రాన్‌ విస్మరించారు. భారత్‌పై దుమ్మెత్తిపోస్తూ ప్రసంగించిన ఆయన.. ఆర్టికల్370ని భారత్ రద్దు చేయడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మరిచిపోయారు. చివరికి సహాయకులు అప్రమత్తం చేయడంతో ప్రవేశపెట్టారు. మరోవైపు కశ్మీరీలకు సాయం చేసేందుకు ఎంతదాకైనా వెళ్తామని, ఇందుకు తమ బలగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా అన్నారు. మంగళవారం ఆయన తన కమాండర్లతో సమావేశం నిర్వహించారు. కశ్మీరీలకు చివరి క్షణం వరకూ పాక్‌ సైన్యం అండగా ఉంటుందన్నారు.

Related posts