telugu navyamedia
culture political Technology trending

పుట్టుకతో రైతుబిడ్డని..వృత్తిరీత్యా అంటరానివాణ్ణి .. : పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ

padmasri nayudamma Death anniversary

పుట్టుకతో రైతుబిడ్డని..వృత్తిరీత్యా అంటరానివాణ్ణి అని గర్వంగా పరిచయం చేసుకున్న ఆదర్శ శాస్త్రవేత్త పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ(1922-1985).. గురించి రెండు మాటలు; చర్మకారులను అంటరానివాళ్లుగా చూసే రోజుల్లో అంటే సుమారు ఓ 70 ఏళ్ళక్రితం తోళ్ల పరిశ్రమ పట్ల చిన్నచూపు ఉండటం సహజమే.శాస్త్రవేత్తలయితే తోళ్ళపరిశ్రమకు సైన్స్ అనవసరం అనేవారు.తోళ్ళని చదును చేసే ప్రక్రియ అన్నా,దానిపై పరిశోధన అన్నా వారికి ఏవగింపు.అలాంటి రోజుల్లో లెదర్ టెక్నాలజీలో పీ హెచ్ డీ పొంది,అమెరికాలో పనిచేసి 1951లో ఇండియాకి తిరిగొచ్చి CLRI ( సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) లో డిప్యూటీ డైరెక్టర్ గా చేరారు నాయుడమ్మ. లెదర్ టెక్నాలజీలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటిని చర్మకారులకు అందించి వాళ్ళవృత్తికి గౌరవం కలిగించాలని కలలుగని విధినిర్వహణలోనే 1985 జూన్ 23న కనిష్క విమాన ప్రమాదంలో కన్నుమూశారు.

శాస్త్రవేత్తలకు ఆదర్శంగా : దుర్వాసన, ఖర్చు, వాతావరణ కాలుష్యం తోలుచదును పని నిరాదరణకు కారణాలని గ్రహించారు. వీటిని తగ్గించి చర్మకారుల ఆదాయం పెంచితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని భావించారు. కానీ తనపరిశోధన ఫలితాలు పల్లెల్లో ఉన్నవారికి అర్ధం కావు. అందుకే వారివిశ్వాసాన్ని చూరగొనడానికి ఎసిడిటీ, ఆల్కలీనీటీ ల రసాయనాలను పచ్చరంగు, తెల్లరంగు పాకెట్లుగా చేసి శుక్రవారం పచ్చ నిదీ ఆదివారం తెల్లనిదీ వాడి మార్పును గమనించమని చెప్పారు. దీనిఫలితాలు చవిచూశాక మిగతా టెక్నాలజీలను అనుసరించారు.

హేతువాదం: ఒకసారి పుట్టపర్తి వెళ్లి సాయిబాబా గాల్లోంచి విభూతి సృష్టించడం చూశారు .వెంటనే నాయుడమ్మ లేచి నిలబడి రెండుచేతులూ జోడించి “విభూతి బదులు మీ అరచేతిలో ఓ గడ్డిపరకని మొలిపించండి” అన్నారు. బాబా అనుచరులు నాయుడమ్మను బయటికి పంపించేశారు. నాయుడమ్మ హేతువాది. భవిష్యత్తు చెబుతామని కొందరూ, భవిష్యత్తులో జరగబోయే అనర్ధాలను నివారించగలమని కొందరూ చెప్పడం చూస్తే నాకు బాధగా ఉంది అన్నారు “శాస్త్రం- మూఢనమ్మకాలు” అనే వ్యాసంలో ‘. అద్భుతాలూ సైన్సూ ఒక ఒరలో ఇమడవని గుర్తించడంతో బాటు కాలం చెల్లిన విలువలనూ మూఢనమ్మకాలనూ భారతీయశాస్త్రవేత్తలు తీవ్రంగా నిరసించాలి’ అన్నారు.

కులం గురించి: తమిళనాడు గవర్నర్ శ్రీ ప్రకాశ కి నాయుడమ్మ కులం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి తో ఫోన్ లో అడిగారు. నాయుడమ్మ కోపాన్ని అదుపుచేసుకుని ” నేను వృత్తిరీత్యా అంటరానివాడిని” అన్నారు. ఆ గొంతులో ఆక్రోశం విన్న గవర్నర్ తరువాత ఫోన్ చేసి తప్పయిందని అంగీకరించారు.

మతాతీత ధోరణి: తమిళనాడులో IT లో డైరెక్టర్ పదవి ఖాళీ అయ్యింది. నాయుడమ్మ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎమ్.జి రామచంద్రన్ ఓ బ్రాహ్మణ అభ్యర్థిని ఎంపికచేయమని సిఫార్స్ చేస్తే ” మా కమిటీ ని రద్దు చేసి కొత్త కమిటీతో మీ అభ్యర్థిని ఎంపిక చేయించుకోండి” అన్నారు నాయుడమ్మ నిర్మొహమాటంగా..రామచంద్రన్ మారు పలక్కుండా నాయుడమ్మ ఎంపికచేసిన మహమ్మద్ సాదిక్ అనే వ్యక్తినే నియమిస్తూ ఆర్డర్ వేశారు.

అర్ధాంగి సాహసోపేత మరణం: నాయుడమ్మ భార్య పవనాబాయి వృత్తిరీత్యా డాక్టరు. భర్త ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేకపోయింది. విమానప్రమాద మంటల్లో ఆహుతైన భర్త లాగే తానూ మంటల్లోనే జీవితాన్ని చాలించాలనుకుంది. పొట్టకోసుకుని,అందులో స్పిరిట్ నింపుకుని అగ్గిపుల్ల వెలిగించింది. అగ్నిజ్వాలల్లో ఆహుతైపోయింది.

నాయుడమ్మ జీవితంలోని ఎన్నో మలుపులనూ ఆసక్తికరమైన ఘట్టాలనూ పొందుపరచిన పుస్తకం ‘ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ జీవితచరిత్ర ‘.

ఈ వేళ నాయుడమ్మగారి వర్ధంతి.

-ప్రకాష్.

Related posts

లక్ష్మీపార్వతి పై లైంగిక వేధింపుల కేసు : లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పాత్రపై అసంతృప్తితోనే మీడియా ముందుకు ..

vimala p

నీటివిడుదలకు సై అన్న .. కృష్ణా జలాల బోర్డు..

vimala p

బదిలీ నిర్ణయంపై అభ్యంతరం..ఈసీకి కడప ఎస్పీ లేఖ

vimala p