telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేపు .. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విద్యార్థి-కార్మిక సంఘాలు..

one day protest by bank employees and students

కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలతో కలిసి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. బుధవారం భారత్ బంద్ ను నిర్వహించున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెను నిర్వహించ తలపెట్టాయి. 25 కోట్ల మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొనబోతున్నట్లు అంచనా. ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సేవా, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ వంటి కార్మిక సంఘాలతో పాటు వివిధ రంగాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న స్వతంత్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సమాఖ్యలు, అసోసియేషన్లు భారత్ బంద్ లో పాల్గొననున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశాలు లేకపోలేదు.

బ్యాంకింగ్ రంగంలో ఉన్న కార్మిక, ఉద్యోగ సంఘాలతో కూడిన బ్యాంకింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) భారత్ బంద్ కు మద్దతు ఇచ్చింది. ఈ ఫెడరేషన్ లో సుమారు పది వరకు వివిధ అసోసియేషన్లు పని చేస్తున్నాయి. భారత్ బంద్ సందర్భంగా ఆయా సంఘాల ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించబోతున్నారు. సాధారణంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు పట్ల విద్యార్థి సంఘాలు పెద్దగా స్పందించవు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా భారత్ బంద్ కు మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. వామపక్ష పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ప్రతినిధులు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ) విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం, అంతకుముందు- జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీల్లో ఢిల్లీ పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునివ్వడాన్ని అనుకూలంగా మార్చుకోనున్నాయి. బంద్ లో పాల్గొని కేంద్రానికి సత్తా చాటాలని భావిస్తున్నాయి.

Related posts