telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

గుట్కా ముడుపుల వ్యవహారంలో .. ప్రభుత్వ ఉన్నత అధికారులు .. : ఈడీ

officials involvement in gutka case

నిషేదిత గుట్కా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ సరఫరా చేస్తున్న వారిని అధికారులు పట్టుకున్నారు. ఆ కేసులో ముడుపుల వ్యవహారంలో మాజీ డీజీపీ టీకే రాజేంద్రన్‌, ఐజీలు దినకరన్‌, శ్రీధర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం (ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసుతో సంబంధం వున్న మరో 20 మంది అధికారులను విచారణ వలయంలోకి తెచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రయత్నిస్తోంది. త్వరలో వీరికి సమన్లు జారీ చేయనున్నారని తెలుస్తోంది. గత కొద్ది మాసాలుగా నత్తనడకన సాగిన గుట్కా ముడుపుల కేసు విచారణ వున్నట్టుండి ఊపందుకుంది. దీనితో ఈ కేసుతో సంబంధం వున్న పెద్దలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 2013లో గుట్కా తదితర మాదకవస్తువుల అమ్మకం, వినియోగంపై నిషేధం విధించారు. అయితే పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారుల అండతోనే రాష్ట్రమంతటా గుట్కా, తదితర పొగాకు వస్తువులు విచ్చలవిడిగా విక్రయించసాగారు.

నిషేధం ముందుకంటే నిషేధం అమలులో ఉన్నప్పుడు గుట్కా, పొగాకు వస్తులు విరివిగా అమ్ముతున్నారంటూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కూడా ఆరోపించారు. ఆ పరిస్థితుల్లో 2016లో చెన్నై రెడ్‌హిల్స్‌ ప్రాంతంలోని మాధవరావు అనే వ్యాపారికి చెందిన గోదాములలో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆ తనిఖీల్లో మాధవరావుకు చెందిన రహస్య డైరీ ఒకటి లభించింది. ఆ డైరీలో గుట్కా తదితర మాదక ద్రవ్యాలను విక్రయించేందుకుగాను ప్రతి నెలా ఆరోగ్యశాఖ మంత్రి, పోలీసు అధికారులకు ఇచ్చిన ముడుపుల వివరాలు వుండటంతో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు దిగ్ర్భాంతి చెందారు. ఆరోగ్యశాఖ మంత్రి, అప్పటి డీజీపీ, మాజీ పోలీసు కమిషనర్‌, ఇద్దరు జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటీ పోలీసు కమిషనర్‌, అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌, ఆరోగ్యశాఖ, ఎక్రైజు శాఖ అధికారులకు ప్రతి నెలా ముడుపులు ఇచ్చినట్టుగా ఆ డైరీలో రాసి వున్నట్టు కనుగొన్నారు. ఆ డైరీ ఆధారంగా తగు వివరాలతో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఓ నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని విచారణ జరిపింది.

ఆ విచారణలో ఆరోగ్యశాఖ మంత్రి, పోలీసు అధికారులు, ఆరోగ్యశాఖ, ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ముడుపుల రూపంలో గుట్కా వ్యాపారి మాధవరావు రూ.40 కోట్ల దాకా చెల్లించినట్టు కనుగొన్నారు. ఈ ముడుపుల వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు రావడంతో వారి నేతృత్వంలో పనిచేస్తున్న అవినీతి నిరోధకవిభాగం విచారణ జరిపితే న్యాయం జరుగదంటూ డీఎంకే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. డీఎంకే శాసనసభ్యుడు జే.అన్బళగన్‌ ఆ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు గుట్కా ముడుపుల కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కేసు నమోదు చేసుకుని గుట్కా వ్యాపారులు మాధవరావు, ఆయన అనుచరులు, మాజీ డీజీపీలు, ఆరోగ్యశాఖ మంత్రి నివాసగృహం సహా 35 చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఆ దాడులలో కీలకమైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ దస్తావేజుల ఆధారంగా సీబీఐ అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, మాజీ డీజీపీలు జార్జ్‌, టీకే రాజేంద్రన్‌, అదనపు కమిషనర్‌ దినకరన్‌, సెంట్రల్‌ జోన్‌ ఐజీ వరదరాజు, విల్లుపురం జిల్లా ఎస్సీ జయకుమార్‌, డీఎస్పీ మన్నర్‌మన్నన్‌ తదితర అధికారుల వద్ద వేర్వేరుగా విచారణ జరిపి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ఆ విచారణ తర్వాత గుట్కా వ్యాపారులు మాధవరావు, శ్రీనివాసరావు, గుప్తా, ఆరోగ్యశాఖ అధికారులు పాండియన్‌, సెంఽథిల్‌ మురుగన్‌, శివకుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేసి పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అరెస్టయిన గుట్కా వ్యాపారులు, అధికారులు అందించిన సమాచారం మేరకు గతేడాది డిసెంబర్‌ 7, 11 తేదీల్లో మంత్రి విజయభాస్కర్‌ సహాయకుడు శరవణన్‌ వద్ద సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణ తర్వాత మంత్రి విజయభాస్కర్‌, వాణిజ్యపన్నుల శాఖ మాజీ మంత్రి రమణ తదితరులు శాస్త్రిభవన్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత సీబీఐ అధికారులు ఈ కేసు విచారణకు సంబంధించిన నివేదికను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణకు పంపింది.

Related posts