telugu navyamedia
సినిమా వార్తలు

నువ్వు నీడ అవక ముందే….!

brathuku chitram poetry corner

కలల రేయిని  కుదేసి
రెప్పల తీగల్లో కాసుల పూలను ప్రసవిస్తూ
పని పొత్తిళ్లల్లో వొత్తిళ్లను
హత్తుకుంటున్న యువ తరువు!

మస్తిష్క పొరల్లో
యంత్ర భాగాలను బిగించుకుంటూ
కెరీర్ కారియర్లో 
రుచితప్పిన జీవితాన్ని
మోసుకుంటూ 
పరుగుల రథంపై
నవ తరం!

కుదించుకుపోయిన సమయాల పొద్దుల్లో
చాకిరీ చీకట్లను
నోట్ల కట్టల్లో పోగేసుకుంటూ
వెలుగు అందాల్ని కోల్పోతున్న భవిత చంద్రుళ్లు!

గొంతు దిగని ఆస్వాదన
సంపాదన జీర్ణకోశంలో
ఆవిరి ఆమ్లమై
అనుభూతుల్ని స్వాహా చేస్తున్నా
ఎండిన అనుభవ పిజ్జాతో
కడుపు నింపుకొని
పాకేజీ
ప్రోగ్రామింగ్ చేస్తున్న కంప్యూటర్ యుగం!

కాలమేదైనా ….
ఉద్యోగమెందైనా…
జానెడు పొట్టనింపేందుకు
జాగా ఇవ్వని 
ఉరుకుల ఆరాటమెందుకు??!
సహజత్వాన్ని
స్పృశించని
సంపద స్పందనలెందుకు??!
పొడిబారిన బతుకు వర్ణాలు
కల్తీ కరెన్సీ కాగితాల్లా  వెలవెలబోయేందుకా??!

నిలు నేస్తం !నిలు!
నిల్చుని నీళ్లు తాగు!
నీ నెత్తురు నీరు కాకముందే!
నువ్వు నీ నుండి
నీరెండ నీడలా మాయమవకముందే…!

-డి.నాగజ్యోతిశేఖర్, తూర్పుగోదావరి జిల్లా.

Related posts