telugu navyamedia
సినిమా వార్తలు

మహానాయకుడికి ముహూర్తం ఖరారు!

Mahanayakudu
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’. తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించారు. క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్‌ రెండు భాగాలుగా రూపొందిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన తొలి భాగంలో ఎన్టీఆర్‌ సినిమా చరిత్రను ఎక్కువ చూపించారు. రెండో భాగం ‘యన్‌.టి.ఆర్‌ – మహానాయకుడు’లో రాజకీయ చరిత్రను చూపించనున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. రాజకీయాల్లోకి వచ్చాక… ఆయన ప్రయాణం ఎలా సాగింది?
మహానాయకుడిగా ఎలా ఎదిగారు? అనే అంశాలతో రెండో భాగం రూపొందింది. ఇందులో ఎన్టీఆర్‌ బాల్యస్మృతులు, వ్యక్తిగత జీవితం కూడా ఉంటాయని తెలిసింది. తొలి భాగమైన ‘కథానాయకుడు’ పంపిణీదారులకే రెండో భాగం ‘మహానాయకుడు’ హక్కులను ఉచితంగా ఇవ్వనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. తొలి భాగం నష్టాల్లో మూడో వంతు వరకూ భర్తీ చేయడంతో పాటు, రెండో భాగం వసూళ్ళలో 40 శాతాన్ని కొనుగోలుదారులకే ఇవ్వనున్నారు. సినిమా కొనుగోలుదారులు, పంపిణీదారులు… అందరితో బాలకృష్ణ వ్యక్తిగతంగా మాట్లాడారని, ఆయన నిర్ణయం పట్ల వారంతా సంతోషంగా ఉన్నారని, కృతజ్ఞతలు చెప్పారని చిత్రబృందం తెలిపింది. దీంతో రెండో భాగం విడుదలపై కొద్ది రోజులుగా వినిపిస్తున్న అనుమానాలకు తెరపడ్డట్టయింది.

Related posts