telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కథానాయకుడు” మా వ్యూ

NTR-Biopic

బ్యానర్ : ఎన్ బికే ఫిలిమ్స్
నటీనటులు : బాలకృష్ణ, విద్యాబాలన్, రానా, సుమంత్ తదితరులు
దర్శకుడు : ఎంఎం కీరవాణి
నిర్మాతలు : కొర్రపాటి రంగనాథ సాయి, బాలకృష్ణ
సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వి.ఎస్
ఎడిటింగ్ : అర్రం రామకృష్ణ

ఈరోజు “ఎన్టీఆర్ : కథానాయకుడు” చిత్రంతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన వారి నుండి అనుకూల స్పందన రావటంతో ఫుల్ జోష్ లో ఉన్నారు నందమూరి అభిమానులు. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రావడంతో థియేటర్స్ దగ్గర ఒక రేంజ్ లో సందడి వాతావరణం నెలకొంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :
1984 మద్రాస్ లో బ‌స‌వ‌తార‌కం (విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. తన తల్లి ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌ (క‌ల్యాణ్‌రామ్‌) ఆందోళ‌న‌కు గుర‌వుతూ ఉంటారు. బసవతారకం క్యాన్సర్ కు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న సమయంలో…. ఎన్టీఆర్ ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తూ ఉండ‌టంతో య‌న్‌.టి.ఆర్‌ జీవితంలో అప్పటివరకూ జరిగిన విషయాలన్ని తెరపై ఆవిష్కృతమవుతాయి. అసలు ఎక్కడో విజయవాడలో సబ్ రిజస్టార్ జాబ్ లో ఉన్న నందమూరి రామారావు (బాల‌కృష్ణ‌)కు సినిమాల్లోకి ఎందుకు వెళ్లాలనిపించింది? సినిమాల్లో రాణించటానికి ఏ అడ్డంకులు ఎదుర్కొన్నారు? ఒక సాధార‌ణ నటుడుగా… గొప్ప స్టార్‌గా ఎలా ఎదిగారు… పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది ? దానికి కారణాలేంటి ? అనే విషయాలను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
సినిమాలో బాలకృష్ణ నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. స్వర్గీయ ఎన్టీఆర్ ను అచ్చుగద్దినట్లు దింపేశాడు. తన తండ్రి పాత్రలో జీవించారు. దాంతో పాటు ఆయన పై బాలయ్యకు ఉన్న గౌరవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఎన్టీఆర్ ని గుర్తుచేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఆ తరువాత బసవతారకమ్మ పాత్రకు విద్యాబాలన్ ప్రాణం పోసింది. ఇక సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు గారి గెటప్ లో అదరగొట్టాడనే చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ కూడా హరికృష్ణ పాత్రలో మెప్పించాడు. ఇక చంద్రబాబు పాత్రలో రానా బాగా ఇమిడిపోయాడు. రకుల్, హాన్సిక, పాయల్, శ్రీదేవి, జయసుధ, జయప్రదల పాత్రల్లో కన్పించి కనువిందు చేస్తారు. నిత్యామీనన్ సావిత్రి పాత్రలో నటించిన తీరు అందరికి షాక్ ఇచ్చింది. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :
కథానాయకుడులో ఎన్టీఆర్ యవ్వనం, సినిమాల్లోకి ప్రవేశం వంటి అంశాలను తీసుకుని ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా ఒక క్రమ పద్ధతిలో సినిమాను అల్లుకుంటూ వెళ్ళాడు దర్శకుడు క్రిష్. సినిమా పరిశ్రమలో ఆయన చేసిన పాత్రలు, తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఈ కథానాయకుడు సినిమాలో ప్రస్తావించారు. బాలకృష్ణ నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, మాయబజార్ సీన్స్, అలనాటి ట్రెండింగ్ పాటలు సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎన్టీఆర్ యంగ్ సన్నివేశాల్లో బాలకృష్ణ ఏజ్ ఎక్కువగా అన్పించడం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టినా… అవి సినిమాలో ఉండక తప్పదు. ప్రథమార్థం కొంచం నెమ్మదిగా సాగినా… ద్వితీయార్థం మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 3/5

Related posts