telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికలకు.. ఎన్ఆర్ఐ ల దరఖాస్తులు.. !

nri people interest in loksabha elections

దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో పలువురు ప్రవాస తెలంగాణవాసులు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతూ పలువురు ఎన్ఆర్ఐలు దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలుండగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు ఎన్ఆర్ఐలు దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఎన్ఆర్ఐలకు పార్టీ టికెట్లు ఇస్తే వారే ప్రచార ఖర్చు సమకూర్చుకుంటారని పలు పార్టీలు టికెట్లు వారికి ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నుంచి ఉత్తం కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. యూకేకు చెందిన మరో ఎన్ఆర్ఐ డాక్టర్ పగిడిపాటి దేవయ్య వర్ధన్నపేట నుంచి తెలంగాణ జనసమితి పక్షాన పోటీ చేసి ఓడిపోయారు. యూఎస్‌కు చెందిన మరో తెలంగాణ ఎన్ఆర్ఐ జలగం సుధీర్ నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూఎస్ శాఖ సంయుక్త కార్యదర్శి అయిన సుక్రూ నాయక్ కూడా నల్గొండ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

యూకేకు చెందిన గంపా వేణుగోపాల్ మెదక్ కాంగ్రెస్ టికెట్ కోసం యత్నిస్తున్నారు. గల్ప్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన జువ్వాడి శ్రీనివాసరావు చేవేళ్ల లేదా మల్కాజిగిరి సీటు కోసం యత్నిస్తున్నారు.తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పలువురు తెలంగాణ ఎన్ఆర్ఐలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Related posts