telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

సాగిపోతున్న … వివేకా కేసు దర్యాప్తు.. సిట్ / సీబీఐ వద్దంట..

/Letter hand writing viveka daughter sunitha

గత ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేసును త్వరిత గతిన విచారించాలని కొత్త సిట్ ను ఏర్పాటు చేసినా గత ఏడు నెలలుగా కేసు మాత్రం క్లైమాక్ష్ కు రాలేదు. నేరస్తులు ఎవరో ఇంతవరకు నిర్ధారణకు రాలేదు. సిట్ అధికారుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఊహించని మలుపు కేసును ఏతు వైపుకు తీసుకువేల్తుందో అన్న భావన కలిగేలా చేస్తుంది. కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డిలను సిట్ బృందం పిలిచి విచారించింది. దీంతో అనంతర పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని సీబీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సిట్ అధికారులను డిఫెన్స్‌లోకి నెట్టింది .

వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సిట్ అధికారులు విచారించిన ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు విచారణకు స్వీకరించడం ఇప్పుడు కడప జిల్లాలో కలకలం రేపుతోంది. తనకు సిట్ అధికారులపై నమ్మకం లేదని, సీబీఐ తో కేసు విచారణ జరిపించాలని ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.దీంతో మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను సిట్ కొనసాగిస్తుందా? లేక సీబీఐ పరిధిలోకి వెళుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. బీటెక్ రవి వేసిన పిటీషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ఈనెల 23వ తేదీలోగా దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ఇక హైకోర్టు నివేదిక అడగటం వివేకా హత్య జరిగి 9 నెలలు గడిచినా నిందితులెవరో నేటికీ తేలకపోవడం సిట్ దర్యాప్తు తీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దర్యాప్తు సంస్థ సిట్ నివేదిక తయారుచేసే పనిలో నిమగ్నమైంది.

ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను నివేదిక రూపంలో సమర్పించేందుకు దర్యాప్తు బృందం రెడీ అవుతుంది. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 23న దర్యాప్తు వివరాలు సమర్పించే పనిలో ఉన్నారు సిట్ అధికారులు.ఈ ఏడాది మార్చి నెల 15వ తేదీన పులివెందులలోని స్వగృహంలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈకేసు విచారణకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మొదట సిట్ బృందాన్ని నియమించింది. టీడీపీ హయాంలో వేసిన సిట్ వేగంగా పని చెయ్యటం లేదని భావించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కడప ఎస్పీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో మరో సిట్ బృందాన్ని విచారణ నిమిత్తం నియమించింది. మొహంతి అర్ధాంతరంగా దీర్ఘకాల సెలవుపై వెళ్లడంతో మూడో సిట్ బృందం తెరపైకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు విచారణలకే పరిమితం అయ్యారు తప్ప కేసులో చెప్పుకోదగ్గ పురోగతి మాత్రం సాధించలేదు సిట్ అధికారులు . దీంతో ఈ కేసులో సీబీఐ రంగంలోకి దిగుతుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు . ఇక ఈ పిటీషన్ పై జనవరి మూడున హైకోర్టు క్లారిటీ ఇవ్వనుంది.

Related posts