telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీసీఎం జగన్ : .. పారదర్శకత పెంచుతూ.. ఇంటర్వ్యూలు లేని ప్రభుత్వ ఉద్యోగాలు..

AP

ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రావాలని ఆదేశించారు. రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలనే నిర్ణయంతో, ఇక మీదట ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలు ఉండవు అని స్పష్టం చేశారు. నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తి పారదర్శకత ఉండేలా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా జగన్ అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ప్రణాళిక చేయాలని కూడా జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారితీస్తుందని అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఇకమీదట ఆ తప్పు జరక్కుండా చూసుకోవాలని పేర్కొన్నట్టు చెబుతున్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఏపిలో జరిగే ఉద్యోగాల భర్తీలో రాత పరీక్షలో చూపించే ప్రతిభే కొలమానం కానుందని. దీనివల్ల మెరిట్ సాధించిన విద్యార్ధులకు ఎంతో మేలు చేకూరనుందని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

Related posts