telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్‌ : .. వినాయక మండపాలకు దరఖాస్తులు తప్పనిసరి.. చందాలు వసూళ్లు కూడదు..

ganesh utsav arrangements going well

ఈసారి కూడా నగరంలో ప్రశాంతంగా వినాయక నవరాత్రి, నిమజ్జనోత్సవాలు పూర్తి చేసి నగర ప్రతిష్టను మరింతగా పెంచాలని సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. గణేశ్ వేడుకల సందర్భంగా 21వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిమజ్జనానికి వెళ్లే వాహనాలకు కలర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నుంచి హుస్సేన్‌సాగర్‌కు వచ్చే వాహనాలకు కూడా వారు కోరితే కోడ్ ఇస్తామన్నారు. చిన్న విగ్రహాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరారు. నిమజ్జనోత్సవానికి వెళ్లే సమయంలో వాహనాలపై అధిక బరువులు వేస్తూ ఓవర్ లోడ్‌తో వాహనాలు వెళ్తుంటాయని, అందులో పిల్లలు, పెద్దలు భారీగా ఉంటారని తెలిపారు. ఓవర్‌లోడ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, వాహనాల్లో పిల్లలు వెళ్లే సమయంలో ఆ వాహనంలో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని కూడా ప్రతి తల్లిదండ్రులు, పెద్దలు గమనించాలన్నారు. ప్రతి మండపం వద్ద పోలీసులు ఉంటారన్నారు. డీజేలు వద్దు.. భక్తిపైనే ధ్యాస పెట్టాలి హైదరాబాద్ సిటీలో మండపాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నారు, ఇప్పటి వరకు 7వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు.

గతంలో బలవంతపు చందాలు వసూళ్లపై ఫిర్యాదులు అందాయని, ఎవరైనా బలవంతపు చందాలు వసూలు చేస్తే వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని ప్రజలకు సూచించారు. హైదరాబాద్‌లో అన్ని వర్గాల వారున్నారని, ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకుంటూ గంగ జమున తెహజీబ్‌గా కలిసిపోతున్నారన్నారు. గణేశ్ నవరాత్రుల సమయంలోనే మొహర్రం పండుగ కూడా వస్తుందని, అందరూ కలిసిమెలిసి పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జనోత్సవం రోజు స్వాగత వేదికలను ఏర్పాటు చేస్తారని, గత ఏడాది ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో అక్కడే చేసుకోవాలని సీపీ సూచించారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు మిరాలం ట్యాంకు, రాజన్నబౌలి, ఎర్రకుంట చెరువు ప్రాంతాల్లో నిమజ్జనం ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ చేస్తున్నామన్నారు.

ఈ ఏడాది కూడా నిమజ్జనం త్వరగా పూర్తి చేయడానికి సాంకేతిక పరమైన హుక్కులను క్రేన్లకు ఉపయోగిస్తున్నామని సీపీ వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి : రాచకొండ సీపీ గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ తెలిపారు. మంగళవారం నేరేడ్‌మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులతో సీపీ మాట్లాడారు. ఈ సందర్భంగా గణేశ్ మండపాల ఏర్పాట్లు, నిమజ్జనం, మండపాల నిర్వహణ, ఊరేగింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ పలు మార్గదర్శకాలను జారీ చేశారు. మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో www.rachakondapolice.gov.in దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.

Related posts