telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్ ఆర్థిక శక్తిగా ఎదగటానికి.. అమెరికా సాయం అవసరం.. : నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

భారత్‌ ఎప్పుడూ అమెరికాతో బలమైన భాగస్వామ్యాన్నే కోరకుంటుందని, అదే సమయంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉంటుందని, దానికోసం ఆ దేశం సహకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వెనిజువెలా, రష్యాపై అమెరికా ఆంక్షలు సహా అంతర్జాతీయ ఆంక్షల్ని సైతం భారత్‌ గౌరవిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దేశ వృద్ధి కోసం వ్యూహాత్మక ప్రయోజనాలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌కు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. ఈ విషయాల్ని ఇప్పటికే అమెరికాతో భారత్‌ చర్చించిందన్నారు. అమెరికాకు వ్యూహాత్మక మిత్రదేశంగా ఉన్న భారత్‌ ఎప్పటికీ ఆర్థికంగా బలంగా ఉండాలనే అగ్రరాజ్యం కోరుకుంటోందని భావిస్తున్నామన్నారు. గత జనవరిలో వెనిజువెలా చమురు ఉత్పత్తి, సరఫరాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. దీంతో భారత్‌ సహా అంతర్జాతీయంగా అక్కడి నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో మన దేశం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది. ప్రస్తుతం వెనిజువెలా చమురును రష్యా చమురు శుద్ధి సంస్థల నుంచి పొందుతోంది.

ఈ ప్రత్యామ్నాయ మార్గానికి స్వస్తి పలికి నేరుగా వెనిజువెలా నుంచే దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న మందగమన పరిస్థితులపై సీతారామన్‌ స్పందించారు. అంతర్జాతీయంగా వాణిజ్య సవాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయన్నారు. అయితే వృద్ధి రేటును గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా ఇటీవల రూ.80వేల కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుందన్నారు.

Related posts