telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ

పుదుచ్చేరిలో నిఫా వైరస్‌ .. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ ..

nipha virus found in pondichery medical alert in state

పుదుచ్చేరిలో ఓ వ్యక్తి నిఫా వైరస్‌ లక్షణాలతో జిప్‌మర్‌ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి వ్యాపించకుండా ప్రత్యేక వైద్య బృందాలు ముమ్మరంగా పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేరళలో గత యేడాది ఈ వైరస్‌ కారణంగా 17 మంది మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొరుగు రాష్ట్రాలకు ఈ వైరస్‌ వ్యాపించకుండా వుండేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో మళ్లీ నిఫా వైరస్‌ ప్రభావం అధికమవడంతో వంద మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కేరళ నుంచి తమిళనాడు, పుదుచ్చేరికి వచ్చే వారి వల్ల ఈ వైరస్‌ వ్యాపించే అవకాశాలు అధికంగా వున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, జ్వరంతో బాధపడేవారికి వైద్య పరీక్షలు నిర్వ హిస్తున్నారు. అలాగే కేరళ నుంచి వచ్చే వాహనాల టైర్లపై క్రిమినాశక మందును చల్లిన తరువాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓ వ్యక్తి ఈ వ్యాధి లక్ష ణాలతో జిప్‌మర్‌ ఆస్పత్రిలో చేరాడు. కడలూర్‌కు చెందిన 50 ఏళ్ల ఆ వ్యక్తి కేరళ సరిహద్దులో కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన స్వస్థలానికి చేరుకున్నాడు. పరిస్థితి విషమించడంతో దిగ్ర్భాంతికి గురైన కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నిఫా వైరస్‌ లక్షణాలు వున్నట్లు గుర్తించారు. వైద్యుల సూచన మేరకు జిప్మర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వార్డులో ఆయనకు వైద్యం అందించారు. ఆయనకు రక్తపరీక్షలు చేయడంతో నిఫా వైరస్‌ సోకినట్లు తెలిసింది. అంతే కాకుండా తమిళనాడులో కూడా ఈ వ్యాధి లక్షణాలున్న వ్యక్తిని గుర్తించడంతో రెండు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోగుల కుటుంబీకులకు కూడా ఈ వ్యాధి సోకివుండవచ్చని అనుమానించిన వైద్యులు వారికి కూడా రక్త పరీక్షలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి డాక్టర్లు, నర్సులు 24 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Related posts