telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

మళ్ళీ నిఫా వైరస్‌ తో … వణికిపోతున్న కేరళ..

nifha virus fear again in kerala

ప్రాణాంతక నిఫా వైరస్‌ కేరళను మరోమారు వణికిస్తోంది. 23 ఏళ్ల ఓ విద్యార్థికి ఈ వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఎర్నాకుళం జిల్లాలోని కలమస్సెరీలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రత్యేక వార్డులో ఆ విద్యార్థితో పాటు మరో ఐదుగురు విద్యార్థులను వైద్యులు పరీక్షిస్తున్నారు. వారికి కూడా నిఫా వైరస్‌ సోకిందా? అన్న విషయాన్ని నిర్ధారించనున్నారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ బుధవారం మీడియాకు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. కేకే శైలజ కోచిలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 23 ఏళ్ల ఓ విద్యార్థికి నిఫా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో.. పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేసే అవసరం లేదని, పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఆ విద్యార్థి పరిస్థితి ప్రస్తుతానికి స్థిరంగానే ఉంది. అతడితో పాటు మరో ఐదుగురు ఇదే ఆస్పత్రిలో చేరారు. ఈ ఐదుగురిని నిఫా వైరస్ సోకిన అనుమానంతో చేర్పించారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా స్థిరంగా ఉంది. వీరికి నిఫా వైరస్‌ సోకలేదని రక్త పరీక్షల్లో బయటపడే అవకాశం ఉందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి రక్త నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీ సంస్థకు పంపాము. వాటి ఫలితాల కోసం వాటి కోసం ఎదురు చూస్తున్నాము” అని కేకే శైలజ చెప్పారు. ఈ రోజు సాయంత్రంలోపు ఆ విద్యార్థులకు కావాల్సిన ఔషధాలు కోచికి చేరుకుంటాయని శైలజ చెప్పారు. తాము అవసరమైన సాయాన్ని అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇడుక్కి జిల్లా తొడుపుళలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న 23 ఏళ్ల ఓ విద్యార్థి ఇటీవల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను కొందరు విద్యార్థులతో కలిసి త్రిశూర్‌ జిల్లా వెళ్లగా అతడికి జ్వరం రావడంతో పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాడు. అనంతరం అతడికి నిఫా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ విద్యార్థితో కలిసి తిరిగిన మరో 311 మందికి జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయా? అనే విషయంపై కూడా వైద్యులు దృష్టి పెట్టారు.

Related posts