telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నీట్, జేఈఈ పరీక్షలపై తొందరపడలేదు: కేంద్ర మంత్రి

Ramesh Phokriyal

నీట్, జేఈఈ పరీక్షలపై తామేమీ తొందరపడలేదని కేంద్ర విద్యాశాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టకుండానే పరీక్షలు పెట్టడంపై వస్తున్న విమర్శలపై మంత్రి స్పందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పరీక్షలకు ప్రిపేర్ అయిన వారు పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారని తెలిపారు. మరో మార్గం లేకనే వీటి నిర్వహణకు అంగీకరించామని ఆయన అన్నారు.

దూరదర్శన్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ జేఈఈ పరీక్షలకు హాజరవుతున్నవారు అడ్మిట్ కార్డులను కూడా డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. పరీక్షలు ఆలస్యం అవుతుంటే, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. మరింత కాలం వారిని వేచి చూసేలా చేయడం తగదని భావించిన తరువాతనే పరీక్షలకు పచ్చజెండా ఊపామని అన్నారు. ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్), మెడికల్ కోర్సుల్లో చేరేందుకు నీట్ (నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పరీక్షలు వచ్చే నెలలో జరుగనున్నాయి. మొత్తం 8.58 లక్షల మంది జేఈఈ పరీక్షలకు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 7.25 లక్షల మంది అడ్మిట్ కార్డులను తీసుకున్నారని, వారి క్షేమమే తమకు ముఖ్యమని, ఆ తరువాతే పరీక్షలని అన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకునే వీటిని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

Related posts