telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్వామీ వివేకానందుడి బోధనలు .. ఎప్పటికీ ఆదర్శప్రాయమే..

national youth day celebrations

నేటికీ స్వామీ వివేకానందుడి బోధనలు అనుసరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్నిపురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసారశాఖ, రీజినల్‌ అవుట్‌రీచ్‌ బ్యూరో వివేకవర్ధిని ఆర్ట్స్‌, కామర్స్‌, పైన్స్‌ కళాశాలలో వివేకానందుడి జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర సంచాలకులు ప్రమోద్‌ హింగే మాట్లాడుతూ దేశ లక్ష్యాలను నెరవేర్చే బాధ్యత యువతపై ఉందన్నారు. దేశ సాధికారతలో భాగం పంచుకోగోరు యువత ముందుగా తమ అర్హతలను పెంచుకోవడంతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. నైపుణ్యాలను పెంచుకునేందుకు యువతీ యువకులు కృషి చేయాలని సూచించారు. అలాగే వ్యక్తిత్వ వికాసం కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.

భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు మొదటిసారి స్వామి వివేకానంద పరిచయం చేశారని, రామకృష్ణ మఠ్‌ ప్రతినిధి ప్రొఫెసర్‌ విశ్వనాధ్‌ అన్నారు. విశ్వగురుగా భారత్‌కున్న శక్తి సామర్ధ్యాలను విదేశీయులకు పరిచయం చేశారని పేర్కొన్నారు. ఉపాధి కల్పనగా విద్యను చూడకూడదని ప్రమాణాలను, నాణ్యతను పరిగణలోకి తీసుకోవాలన్నారు. స్వామి వివేకానంద 19వ శతాబ్ధంలో చికాగోలో చేసిన ప్రసంగం దేశ నిర్మాణంలో యువత పాత్రను శక్తివంతంగా ఎత్తిచూపించారని ఆయన చెప్పారు. వివేక వర్ధిని విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి అనిల్‌ రాజేశ్వర్‌ మాట్లాడుతూ 1921లో గాంధీజీ విద్యాసంస్థను సందర్శించారని చెబుతూ విద్యారంగంలో విశేష సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ అవుట్‌పుట్‌ బ్యూరో సహాయ సంచాలకులు మానస్‌ కృష్ణకాంత్‌, శ్రీహరిబాబు, భారత లక్ష్మి, కళాశాలప్రన్సిపాల్‌ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts