telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాలలో.. తెలంగాణ కుర్రాడికి మొదటి ర్యాంకు..

nalgonda guy got first rank in ifs results

తాజాగా విడుదలైన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్ఎస్) ఫలితాల్లో తెలంగాణ కుర్రాడు సత్తా చాటాడు. నల్లగొండలోని వీటీ కాలనీకి చెందిన మందాడి నవీన్‌రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఐఎఫ్‌ఎస్‌-2018 తుది ఫలితాలను ప్రకటించిన యూపీఎస్సీ, దేశవ్యాప్తంగా 89 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో నవీన్‌ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు వందలోపు ర్యాంకులు సాధించారు.

పసుపులేటి మోనికా కిషోర్‌ 41వ ర్యాంకు, చైతన్యకుమార్‌ రెడ్డి 42వ, మహ్మద్‌ అబ్దుల్‌ సహిద్‌ 45వ, కనకాల అనిల్‌కుమార్‌ 46వ ర్యాంకులు సాధించారు. కాగా మొదటి ర్యాంక్‌ సాధించిన నవీన్‌రెడ్డిది మధ్యతరగతి కుటుంబం. నవీన్‌రెడ్డి తండ్రి శేఖర్‌రెడ్డి మిర్యాలగూడ కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం మిర్యాలగూడలో చేసిన నవీన్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ సీబీఐటీలో చేశారు. అనంతరం పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం సంపాదించారు.

నవీన్‌రెడ్డి ఐదుసార్లు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాశారు. రెండుసార్లు ఇంటర్వ్యూకు ఎంపికైనా విజయం సాధించలేకపోయారు. కానీ, ఐఎఫ్‌ఎస్‌కు తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచారు. సివిల్స్‌లో విజయం సాధించకలేకపోయినా, గిరిజనులకు సేవచేసే ఐఎఫ్ఎస్ ఎంపికవడం సంతోషంగా ఉందని నవీన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో పర్యావరణానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని, తన బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు పాటు పడతానని తెలిపారు.

Related posts