telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్.. ‘రైతుబంధు’ ను కేంద్రం కాపీ కొట్టింది: ఎంపీ బిబి పాటిల్

MP BB Patil Comments Central Budget
కేంద్ర  ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ పై జహీరాబాద్ టీఆరెస్  ఎంపీ బిబి పాటిల్ స్పందించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంచ‌ల‌న నిర్ణయాలతో దేశ రాజ‌కీయాల్లో విల‌క్షణ ప్రధానిగా పేరుగాంచిన మోదీ కూడా ఇప్పుడు కేసీఆర్ బాట‌నే ఎంచుకున్నారని.  తెలంగాణ ప్రభుత్వం  స‌క్సెస్‌ఫుల్‌గా అమ‌లు చేసిన రైతుబంధును మోదీ స‌ర్కార్ కాపీ కొట్టడం  నిజంగా అది కేసీఆర్ ఔన‌త్యానికి చెందుతుందన్నారు.
నిరాశ‌లో ఉన్న రైతుల‌కు రైతుబంధు ప‌థ‌కంతో ప్రాణం పోసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశ రైతాంగానికి ఆప‌ద్భాంద‌వుడిలా మారారన్నారు.  ఇటీవ‌ల ఇక్యరాజ్యసమితి  కూడా రైతుబంధు ప‌థ‌కాన్ని ఎన‌లేని విధంగా కీర్తించిందని కొనియాడారు. 130 కోట్ల భారత దేశానికి కూడా ఇప్పుడు రైతుబంధు ప‌థ‌కం ఎంతో అవ‌స‌ర‌మైంది. కేసీఆర్ లాంటి రాజ‌కీయ దూర‌దృష్టి ఎంతైనా అవ‌స‌ర‌మ‌ని ఈ ప‌థ‌కంతో తెలుస్తోందన్నారు. దేశ రైతాంగాన్ని కాపాడేందుకు, వ్యవసాయ సంక్షోభాన్ని త‌రిమేందుకు మోదీ ప్రభుత్వం అన్ని వ‌ర్గాలు హ‌ర్షించే కిసాన్ స‌మ్మాన్ ప‌థ‌కాన్ని  తీసుకొచ్చిందన్నారు.
తెలంగాణ  రాష్ట్రంలో  పలు సంక్షేమ పథకాలు చేపట్టారని, వృద్దాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ లను పెంచిన ఘనత  సీఎం కేసీఆర్ దేనని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ  కార్యక్రమాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. విభజన హామీల పై పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నామని అన్నారు. పలు విషయాలను సభ దృష్టికి తీసుకొని రావడం వల్లే  హై కోర్ట్ విభజన జరిగిందన్నారు.
జహీరాబాద్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టమని తెలిపారు. వైద్య సేవల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులను ఈ సందర్భంగా బాధితులకు  పంపిణీ చేశారు. దివ్యాంగులకు దృవీకరణ పత్రాలు అందజేయడానికి సదరన్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 న పాసుపోర్టు కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నర్సాపూర్ రహదారి విస్తరణకు నిధులు మంజూరయ్యాయని  తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో  అధిష్టానం ఆదేశించిన  పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని బిబి పాటిల్ పేర్కొన్నారు.

Related posts