telugu navyamedia
news telugu cinema news trending

పద్మభూషణ్ రామానాయుడు కల సాకారం కాలేదు

RN

ప్రతి రోజూ వందలాదిమంది పుడుతూ వుంటారు… మరణిస్తూ వుంటారు. కానీ చనిపోయాక గుర్తు చేసుకునే వ్యక్తులు కొందరే వుంటారు. వారు సాధించిన విజయాలు, సమాజానికి వారు చేసిన సేవలు.. ముందు తరాలకు వారి స్ఫూర్తి . ఇవన్నీ ఆ వ్యక్తులను స్మరణీయులుగా చేస్తాయి. అలాంటి వారిలో పద్మభూషణ్ డి. రామానాయుడు స్మృతి పథంలో ఎప్పటికీ మిగిలిపోతారు. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారిది భారతీయ సినిమా రంగంలో ఉజ్వల చరిత్ర, సినిమా రంగంలో ఆయన ఒక రోల్ మోడల్. సినిమాను అమితంగా ప్రేమించిన మాన్యుడు రామానాయుడు గారు సినిమా రంగానికే జీవితాన్ని అంకితం చేసిన ప్రతిభాశాలి. భారతీయ భాషల్లో సినిమాలు తీసిన ప్రభావశీలి. పద్మభూషణుడు, మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అగ్ర నిర్మాత రామానాయుడు గారు తరతరాలను ప్రభావితం చేస్తూనే వుంటారు. ఈరోజు రామానాయుడు గారి 84వ జయంతి.

RN3

జూన్ 6, 1936 లో ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించిన రామానాయుడు గారు. చదువు అనంతరం ఊళ్ళోనే ఉండి వ్యవసాయ పనులు చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడే కారంచేడు వాస్తవ్యులు యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో “నమ్మిన బంటు” అనే సినిమాను మొదలు పెట్టారు. అందులో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నాయిక నాయకులు. ఈ సినిమాలో కొంత భాగాన్ని కారంచేడులో చిత్రీకరించారు. ముఖ్యంగా ఎద్దుల సన్నివేశాలన్నీ కారంచేడు లోనే తీశారు. వెంకన్న చౌదరి గారు రామానాయుడు గారికి బంధువులవుతారు. షూటింగ్ జరిగినన్ని రోజులు రామానాయుడు గారు అక్కడ ఉండి అన్ని పనులు చూసేవారు. ఆ ఎద్దులు కూడా కారంచేడు గ్రామానికే చెందినవి కాబట్టి రామానాయుడు గారు వాటిని మచ్చిక చేసుకొని షూటింగ్ లో ఇబ్బందులు లేకుండా చూసేవారు. షూటింగ్ సమయంలో చాలా సరదాగా, హుషారుగా ఉండేవారు. అందుకే అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అలా “నమ్మినబంటు “సినిమా రామానాయుడు గారికి స్ఫూర్తి నిచ్చింది. బ్రతుకు తెరువు కోసం మద్రాస్ వెళ్లిన రామానాయుడు గారు అక్కడ ఇటుక వ్యాపారం చేస్తూ ఉండగానే దర్శకుడు గుత్తా రామినీడుతో పరిచయం అయ్యింది. అప్పటికే ఆయన “అనురాగం ” అనే సినిమా నిర్మాణం పనుల్లో వున్నారు. రామానాయుడు లోని ఉత్సాహం చూసిన రామినీడు ఆయన్ని పార్ట్నర్ గా చేర్చుకున్నారు . 1963 జూన్ 14న ఈ సినిమా విడుదలైంది. కానీ ఆశించినవిధంగా విజయవంతం కాలేదు.

Ramanaidu

అయితే రామానాయుడు నిరుత్సాహపడలేదు. అదే సంవత్సరం తన స్వంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ను ప్రారంభించారు. ఎన్.టి రామారావు ద్విపాత్రాభినయంతో జమున, ఎల్.విజయలక్ష్మి నాయికలుగా, తాపీ చాణిక్య దర్శకత్వంలో “రాముడు భీముడు” సినిమాను రూపొందించారు. ఈ సినిమాతో రామానాయుడు గారికి సినిమారంగంలో పేరు, గౌరవం లభించాయి. అక్కడ నుంచి నిర్మాతగా రామానాయుడు ప్రయాణం మొదలైంది. మధ్య మధ్యలో కొన్ని అపజయాలు వచ్చినా రామానాయుడు గారు అధైర్య పడలేదు, వెనక్కు తిరిగి చూడలేదు. ఎందరో నటి నటులను సినిమా రంగానికి పరిచయం చేశారు. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. సాంకేతిక నిపుణులను ప్రోత్సహించారు. హైద్రాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ నిర్మాణం చేపట్టారు. కలర్ ల్యాబ్, పంపిణీ సంస్థలను, చీరాలలో థియేటర్ లను ప్రారంభించారు. భారతీయ భాషలన్నిటిలో సినిమా నిర్మాణం చేపట్టి అందరికీ ఆదర్శమైన నిర్మాతగా చరిత్ర సృష్టించారు. 132 సినిమాలను రూపొందించారు. ఇద్దరు కొడుకుల్లో ఒకరిని నిర్మాతగా మరొకరిని హీరోగా చేసి తన వారసత్వం సినిమా రంగంలో కొనసాగేలా చేశారు. తన సినిమా జీవితానికి మార్గదర్శకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగు దేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు ఆహ్వానంతో 1999లో బాపట్ల పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీ తో ఎంపీ గా గెలిచారు.

Ramanaidu
తాను పుట్టిన గడ్డ, తాను చదువు కున్న ప్రాంత ప్రజలకు ఎన్నో సౌకర్యాలను కల్పించారు. ప్రజానాయకుడుగా మాతృభూమి ఋణం తీర్చుకున్నారు. నిర్మాత రామానాయుడు సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2009 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 2012లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో రామానాయుడు గారిని సన్మానించింది. ఈ రెండు అవార్డులు రామానాయుడు గారి సేవలకు, సాధించిన విజయాలకు లభించిన పురస్కారాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని సాధించిన మూవీ మొఘల్ రామానాయుడు గారి మనసులో మాత్రం ఓ కోరిక అలాగే మిగిలిపోయింది. ఆయన కనీసం ఒక్క సినిమాకు అయినా దర్శకత్వం వహిద్దామనికున్నారు. ఆయన సంస్థలో పని చేసిన దర్శకులంతా ఆయన దర్శకత్వం చేసే సినిమాకు సహాయ దర్శకులుగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఆ స్వప్నం సాకారం కాకుండానే 18 ఫిబ్రవరి 2015లో ఇహలోక యాత్ర ముగించారు. డాక్టర్ రామానాయుడు గారు సినిమా రంగానికి ఎప్పటికీ ప్రాతఃకాల స్మరణీయులు.

Ramanaidu

– భగీరథ
సీనియర్ జర్నలిస్ట్

Related posts

సచిన్ రికార్డుకు .. అతిచేరువలో .. కోహ్లీ..

vimala p

రాహల్ రాజీనామాను తిరస్కరించిన సీడబ్ల్యూసీ

vimala p

రాజస్థాన్ లో “పానిపట్” సినిమాలను నిలిపివేయాలంటూ డిమాండ్… థియేటర్ పై దాడి

vimala p