telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఈ పరిస్థితులలో .. పాక్ తో చర్చలు అనవసరం.. : మోడీ

modi on pak terrorism in bishkek

భారత ప్రధాని మోదీ, పాక్ తో చర్చలు జరపాలంటే తొలుత ఆ దేశం ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని, ఆ తర్వాతే చర్చల గురించి మాటలు ఉంటాయని తేల్చి చెప్పారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో)లో పాల్గొనేందుకు బిష్కెక్ వెళ్లిన మోదీ.. చైనా అధ్యక్షుడితో సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ఆ దేశం కఠిన చర్యలు తీసుకునే వరకు చర్చల ప్రసక్తే లేదని, అయితే, అది జరుగుతుందని తాము అనుకోవడం లేదని జిన్‌పింగ్‌తో మోదీ చెప్పినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. పాక్ విషయంలో చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇదే సదస్సుకు హాజరైన పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో జిన్‌పింగ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. పాక్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ-ఇమ్రాన్‌ల మధ్య తొలిసారి బిష్కెక్‌లో సమావేశం జరిగే అవకాశం ఉందని భావించినా ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా కశ్మీర్ సహా పలు వివాదాస్పద అంశాలపై మాట్లాడుకుందామంటూ ఎస్‌వోసీకి ముందు ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీలు భారత్‌కు లేఖ రాశారు. అయితే, సదస్సు సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

భారత్‌తో తమకు పెద్దగా ఎటువంటి సమస్యలు లేవని, ఆ దేశంతో తాము విభేదించేది ఒక్క కాశ్మీర్ అంశంలోనేనని, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ గొప్ప మెజారిటీతో విజయం సాధించారని, దానిని ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం, శాంతి సామరస్యాల కోసం వినియోగిస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, చర్చల వల్ల కశ్మీర్ వంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఇమ్రాన్ పేర్కొన్నారు. నిజానికి భారత్‌లో ఎన్నికలు జరగడానికి ముందు నుంచీ చర్చల కోసం ప్రయత్నిస్తున్నామని, ఎన్నికల సమయంలో భారత్‌లో పాక్ వ్యతిరేక భావాలు నెలకొన్నాయని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి పాక్ ఇస్తున్న అవకాశాన్ని భారత్ వినియోగించుకుంటుందని భావిస్తున్నట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు.

బిష్కెక్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉగ్రవాదంపై చర్చలు జరిగాయి. తీవ్రవాద రహిత వాతావరణం ఏర్పాటుకు పాక్ పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దశలో పాక్ నుంచి అలాంటి చర్యలు ఏమాత్రం ఆశించలేమని మోదీ చైనా అధినేతతో చెప్పారు. భారత్ మాత్రం శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పులేదని, పాకిస్థాన్ తో శాంతియుత సంబంధాలనే కోరుకుంటున్నామని మోదీ వివరించారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రధాని మోదీ-జిన్ పింగ్ భేటీ వివరాలను వెల్లడించారు.

Related posts