telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వారికోసమే సీఏఏ .. తీసుకొచ్చాము.. : మోడీ

modi on CAA in national youth celeb

సీఏఏ వలన భారత్‌లో ఏ ఒక్కరి పౌరసత్వం రద్దుకాదని, పొరుగు దేశాలలో హింసకు గురవుతున్న ప్రజల్ని ఆదుకునేందుకు సీఏఏ తీసుకొచ్చామని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. దీనివల్ల ఈ అంశంలో విపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని.. ప్రజలకు పిలుపునిచ్చారు. కోల్‌కతా నౌకాశ్రయానికి శ్యామాప్రసాద్ ముఖర్జీ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. పౌరసత్వసవరణ చట్టంపై అపోహలొద్దు.. విపక్షాల అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దు. ఇది కేవలం పాకిస్థాన్ లాంటి పొరుగుదేశాల్లో మతహింసకు గురవుతున్న పౌరుల్ని ఆదుకునేందుకు ఉద్దేశించి తీసుకొచ్చిన చట్టం. దేశంలోని ఏ ఒక్క పౌరుని పౌరసత్వం రద్దు కాదు. ఇదీ బెంగాల్ గడ్డపై నుంచి ప్రధానమంత్రి మోదీ విస్పష్ట ప్రకటన. మహాత్మా గాంధీ సైతం పాక్‌లో మతపరమైన హింసకు గురవుతున్న వారికి పౌరసత్వం కల్పించాలని ఆకాంక్షించారని గుర్తు చేశారు. తాజా చర్చల వల్ల పాక్‌లో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలు వెలుగులోకి వచ్చాయన్నారు మోడీ. రెండో రోజు బెంగాల్ పర్యటనలో భాగంగా మోదీ.. హావ్‌డాలోని బేళూరు మఠంలో జరిగిన వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దివంగత ఆత్మస్థానానంద సేవల్ని గుర్తుచేసుకున్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా.. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ మార్గనిర్దేశకంగా పనిచేస్తుందన్నారు. వివేకానందుడి మార్గమే అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కోల్‌కత నౌకాశ్రయానికి భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పేరు పెడుతున్నట్టు మోడీ ప్రకటించారు.

కోల్‌కత నౌకాశ్రయ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని …ఒకే దేశం, ఒకే రాజ్యాంగం ఆలోచనకు అంకురార్పణ చేసిన గొప్ప నాయకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ అని ప్రశంసించారు. సత్యాగ్రహం నుంచి స్వచ్ఛ భారత్ వరకు ఎన్నో కార్యక్రమాలకు కోల్‌కత పోర్టు వేదికైందని గుర్తు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు.అంతకుముందు రవీంద్రసేతు లైటింగ్ కార్యక్రమాన్ని మోడీ, మమతలు వీక్షించారు. బెంగాల్లో సీఏఏ,ఎన్ఆర్సీ అమలు చేయాలని భావిస్తే… తన శవం మీద నుంచే జరగాలని ప్రధానికి స్పష్టం చేసినట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్దమైన ఆబ్లిగేషన్‌తోనే మోడీని కలిసినట్లు తెలిపారు. మరోవైపు..బెంగాల్‌ పర్యటనలో నరేంద్ర మోడీకి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జేఎన్‌యూ హింసకు నిరసనగా… విద్యార్థి సంఘాల నాయకులు గోబ్యాక్‌ మోదీ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శించారు. ప్రధాని కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో నిరసనకారులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts