telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఇక రాష్ట్రాలపైనే .. మోడీ కన్ను .. క్షుణ్ణంగా పనితీరు పరిశీలన..

modi an eye on all states

దేశంలోని అన్ని రాష్ట్రాల పనితీరును కీలకమైన పది రంగాల్లో 51 సూచీల ద్వారా కేంద్ర ప్రభుత్వం మదింపు చేయబోతోంది. ఇందుకోసం సుపరిపాలన సూచీ (సీజీఐ)కి సంబంధించిన మెరుగుపరచిన వెర్షన్‌ను ఉపయోగించబోతోంది. కేంద్రం దృష్టి సారించే రంగాల్లో వ్యవసాయం, ప్రజారోగ్యం, మౌలిక వసతులు, సాంఘిక సంక్షేమ పథకాలు, న్యాయ, ప్రజా భద్రత, పర్యావరణం, వాణిజ్యం, పరిశ్రమలు వంటివి ఉంటాయి. సీజీఐ కొత్త వెర్షన్‌ను ఈ ఏడాది జులైలో ప్రారంభించే అవకాశం ఉంది.

సదరు రాష్ట్రం ఎక్కడ వెనుకబడి ఉందన్నది తొలుత ఇది గుర్తిస్తుంది. ఆ తర్వాత పరిష్కార చర్యలను గుర్తిస్తుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్ట పాత్ర ఉంటుంది. ఈ-ఆఫీసుకు సంబంధించిన వ్యవస్థ ద్వారా కేంద్ర మంత్రిత్వశాఖలు రాష్ట్రాల సచివాలయాలతో అనుసంధానమవుతాయి. అదే రీతిలో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార, పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన కొత్త వెర్షన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. అది ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఇది అన్ని ప్రభుత్వ దస్త్రాలను డిజిటల్‌ రూపంలోకి మార్చేస్తుంది.

దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఫిర్యాదులపై పరిశీలన సమయం తగ్గుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఫిర్యాదులను ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతి నెలా సమీక్షిస్తుంది. రైల్వేలు, పోస్టల్‌, టెలికం, మౌలిక వసతుల ప్రాజెక్టుల అంశాలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. 2014లో మోదీ సర్కారు తొలిసారిగా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ప్రారంభించింది. అప్పట్లో ఏటా 2.98 లక్షల ఫిర్యాదులు అందేవి. ఆ తర్వాత వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ ఏడాది మే 24 నాటికి అవి 6 లక్షలకు చేరాయి. ఫిర్యాదుల పరిష్కార శాతం 2014లో 75 శాతం ఉండగా, గత ఏడాది చివరి నాటికి అది 94 శాతానికి చేరుకుంది.

Related posts