telugu navyamedia
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న – ట్విటర్ వేదికగా భావోద్వేగ మెసేజ్

*అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన మిథాలీ రాజ్
*ఆడిన ప్ర‌తీ ఆట‌ను ఆస్వాదించా.. 
*రిటైర్మెంట్ కు ఇదే స‌రైన స‌మ‌యం..

భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపారు

ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా భావోద్వేగ మెసేజ్ చేసింది మిథాలీ. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు.

ఇన్నేళ్లు జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. ప్రతి సంఘటన నాకో కొత్త పాఠం నేర్పించింది. నా జీవితంలోని చివరి 23 ఏళ్లు సవాళ్లు, సంతృప్తితో సాగాయి. వాటన్నిటినీ నేను ఆస్వాదించాను. అన్ని ప్రయాణాల్లాగే నాదీ ముగించాల్సిందే. ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా అని మిథాలీ ట్వీట్‌ చేసింది.

మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టును గెలిపించాలని భావించేదానిని. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం జట్టు ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల చేతుల్లో ఉంది. భారత మహిళల క్రికెట్‌ జట్టు భవిష్యత్తు బాగుంటుందని తెలుసు. అందుకే నా రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను అంటూ ట్విటర్ వేదికగా లేఖ పోస్ట్ చేసింది మిథాలీ.

ఈ సందర్భంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, కార్యదర్శి జై షాకు మిథాలీ ధన్యవాదాలు తెలిపారు. క్రికెటర్‌గా తన ప్రయాణం ముగిసినా ఆటలో ఏదో విధంగా భాగస్వామ్యం అవుతానంటూ భవిష్యత్‌ ప్రణాళికల గురించి హింట్‌ ఇచ్చారు. భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. తనకు అండగా నిలిచి ఆదరాభిమానాలు చూపిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts