telugu navyamedia
సామాజిక

పొరబాట్లు జరిగాయి, దిద్దుకోవాలి. ..

మళ్ళీ చెబుతున్నాను. జరిగినవి పొరబాట్లు మాత్రమే. తప్పులు కావు. అంచేతే సరి చేసుకోవడానికి అవకాశం వుంది. మా స్వగ్రామం కంభంపాడు ఓ కుగ్రామం. నా వయసు డెబ్బయి అయిదు అంటే నేను పుట్టేనాటికే మా ఊళ్ళో ఓ మిషనరీ పాఠశాల వుండేది. అది పూరిపాకలో కాదు. మంచి భవంతిలో. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.

నేను చదువుకున్న బడి నడి ఊళ్ళో వుంది. పూరిల్లు. వర్షం వస్తే సెలవు. అలా వుండేది.
మా తాతగారు భండారు సుబ్బారావు గారు కాశీ యాత్ర చేసివచ్చిన ఓ స్వామీజీకి తనకున్న భూమిలో ఇరవై ఎకరాలు దానం చేసి ఆయనకు ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చారు. ఊళ్ళోని రైతులు కూడా, మరో ఇరవై ఎకరాల దాకా సాయం చేశారు. కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని స్వామీజీ ఆ ఆశ్రమంలో ప్రతిష్టించి ఓ చిన్న గుడి కట్టించారు. కొన్నాళ్ళు వైభవంగానే రోజులు గడిచాయి.

కాలక్రమంలో స్వామీజీ కాలం చేశారు. ఆశ్రమం పాడు పడింది. మా తాతగారు చనిపోయారు. గుళ్ళో దీపం పెట్టేవాళ్ళు కరువయ్యారు. ఆశ్రమానికి సాయం చేసిన మా కుటుంబంలోని వాళ్ళు కూడా పై చదువులకు, ఉద్యోగాలకు నగరాలకు తరలిపోవడంతో పరిస్థితి మరింత అధ్వాన్నం అయింది. మా తాతగారు దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు ఓ ఇరవై ఎకరాలు గుడి పేరున వుంచి, దాన్ని ఆ పూజారికే వదిలివేశారు.

దానిపై వచ్చిన ఆదాయం (కౌలు డబ్బులు) తో జీవనం గడుపుతూ, గుడి బాగోగులు చూడమని అప్పగించారు. ఆ భూములపై ఇప్పుడు మాకు ఎటువంటి హక్కులు లేవు. మిగిలిన ఇరవై ఎకరాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ అక్కడ ఓ ఎస్సీ కాలనీ నిర్మిస్తే బాగుంటుందని నాటి జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ రాసారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన జంధ్యాల హరినారాయణ గారు అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్.

ఆ ఉత్తరం చూసి ముందు ఆయన నమ్మలేదు. ఎస్సీ కాలనీల కోసం భూముల సేకరణకు తమ సిబ్బంది కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతుంటే ఒక్కళ్ళూ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఎవరీయన ఏకంగా ఇరవై ఎకరాలు దఖలు పరుస్తూ ఉత్తరం రాశారని ఆశ్చర్యపోతూ మా ఊరు వచ్చి స్వయంగా పరిశీలించి వెళ్ళారు. బహుశా ఆయన హయాములోనే అనుకుంటా జిల్లా మొత్తంలో ఓ పెద్ద ఎస్సీ కాలనీ మా ఊళ్ళో వెలిసింది.

ఇదంతా ఎందుకు అంటే..
పొరబాట్లు ఎక్కడ ఎలా జరిగాయో తెలిపేందుకు. అప్పటికే మూడు గుళ్ళు వున్న మా ఊళ్ళో మరో గుడి కట్టడానికి భూములు ఇచ్చిన రైతులు తర్వాత ఆ గుడిలో దేవుడిని పట్టించుకోలేదు. ఊళ్ళో బడి దిక్కూ మొక్కూ లేకుండా వుంటే దాని సంగతి పట్టించుకోలేదు. అదే సమయంలో మిషనరీ వారు ఎక్కడో విసిరేసినట్టున్న మా ఊరువంటి ఓ మారు మూల గ్రామంలో ఓ మంచి పాఠశాల కట్టించారు. అక్కడ చదువుకున్న పిల్లలు జీవితంలో ఎంతో ఎదిగి వచ్చారు.

గుడి ప్రాధాన్యతను నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ సమాజానికి కావాల్సిన వాటిని అందించడంలో మన ధార్మిక సంస్థలు తగినంత కృషి చేయడం లేదు. కోట్ల కోట్ల ఆస్తులు కలిగిన సంస్థలు కూడా చదువుకూ, ఆరోగ్యానికీ ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఏదైనా అంటే అది ప్రభుత్వాల బాధ్యత అంటారు.
కంచిపీఠం, రామకృష్ణ మఠం వంటివాళ్ళు చక్కని విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్వహిస్తున్న సంగతి వాస్తవమే.

కానీ విస్తృత హిందూ సమాజపు విద్య, వైద్య అవసరాలని అవి తీర్చగలిగే స్థాయిలో లేని మాట కూడా నిజమే. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణ అనేది మొదటి ప్రాధాన్యంగా అవి కార్య కలాపాలు నిర్వహిస్తున్నాయి.
విద్య, వైద్య రంగాల ప్రాధాన్యత గుర్తించిన మిషనరీ సంస్థలను నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు మతం మారితే మనం తప్పుపడుతున్నాము. వాళ్ళని దూరం చేసుకుని, వాళ్ళే దూరం జరిగారని అనుకుంటే లాభం ఏమిటి?
అయితే, మతం మార్చుకుని కూడా ప్రభుత్వ సదుపాయాలను, సౌకర్యాలను అనుభవించడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇందులో భేదాభిప్రాయం లేదు…ఉండరాదు..
– భండారు శ్రీనివాసరావు.

Related posts