telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం

prashant reddy trs

బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి పారుదల పై మంగళవారం హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గొలుసుకట్టు చెరువును నింపడానికి పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. వరదకాలువ మీది 9 కొత్త తూముల నిర్మాణం ద్వారా 6 చెరువుల్లో కాళేశ్వరం నీళ్లు నింపుకుంటున్నామని, మరో మూడు చెరువులకు నీరు వెళ్లేందుకు ప్రణాళిక చేయాలని మరియు ఆ 6 చెరువుల ద్వారా మరో 8 చెరువులకు లింక్ చేసి మొత్తంగా 17 చెరువులకు వరదకాలువ ద్వారా కాళేశ్వరం నీళ్లు అందేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ లక్ష్మీ కెనాల్ మీద 14 పాత తూముల ద్వారా 14 ప్రధాన చెరువులు నింపుతున్నామని, మరో 12 కొత్త తూముల నిర్మాణం చేపట్టి అదనంగా 9 చెరువులు నింపేందుకు కృషి చేయాలని అంతిమంగా ఈ 23 చెరువుల నుండి మరో 40 చెరువులను లింక్ చేసి మొత్తం 63 చెరువులను నింపాలని అధికారులను ఆదేశించారు.

పల్లికొండ లిఫ్ట్ ద్వారా ప్రస్తుతం పల్లికొండ, సిద్ధపల్లి చెరువులు నింపుతున్నామని… బాచన్ పల్లి,పిప్రి, పురాన్ పేట్, భీంగల్, ముచ్కూర్ చెరువులు కూడా నింపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గట్టు పొడిచిన వాగు ద్వారా ప్రస్తుతం కోనసముందర్,బషీరాబాద్, అమీర్ నగర్ చెరువులు నింపుతున్నామని… చౌట్పల్లి చెరువులు నింపే పనులు మొదలు పెట్టాలని… అట్లాగే ఇనాయత్ నగర్,నర్సాపూర్ చెరువులు నింపేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు. గుత్ప లిఫ్ట్ ద్వారా కూడా చివర ఆయకట్టు చెరువులకు నీరందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని వాగులపై ఇప్పటికే మెజారిటీ చెక్ డ్యామ్ లు నిర్మించుకున్నామని అలాగే గొలుసు కట్టు చెరువులు నింపుకోవడం ద్వారా రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యమని…పచ్చని పైరులతో రైతుల మోహల్లో ఆనందం వెల్లివిరియాలనేది ఆయన కోరిక అని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Related posts