telugu navyamedia
తెలంగాణ వార్తలు

దమ్ముంటే మంత్రి గంగులపై పోటీ చేసి గెలవాలి..

మంత్రి గంగుల కమలాకర్ పై పోటీ చేసి విజయం సాధించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

గురువారం కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. బండి సంజయ్ పై లక్ష ఓట్ల మెజారిటీతో గంగుల కమలాకర్ విజయం సాధిస్తారని మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో సీసీ రోడ్ల పనులకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రవిశంకర్​, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​తో కలిసి మంత్రి కేటీఆర్​ భూమి పూజ చేశారు.

తెలంగాణ తెచ్చిన కేసీఆర్​పై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్​ను తొక్కేస్తామని, జైలుకు పంపిస్తామని కొందరు మాట్లాడుతున్నారన్న ఆయన.. సీఎం ఏం తప్పుడు పని చేసారని జైలుకు పంపిస్తారంటూ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకు జైలుకు పంపుతారా?.. రైతులకు ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తున్నందుకు కేసీఆర్​ను ఇంటికి పంపిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పార్లమెంట్​లో ఒక్కరోజైనా మాట్లాడారా అన్నారు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌.. పైసా పని కూడా చేయలేదని విమర్శించారు. మూడేళ్ల కాలంలో సంజయ్‌ ఏం అభివృద్ధి చేశారని సూటిగా ప్రశ్నించారు. 

మూడేళ్లలో కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలంతా దేశ ద్రోహులన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆయన బీజేపీపై మండిపడ్డారు.

ఎప్పుడూ హిందూ అనే మాట్లాడే బండి సంజయ్… కనీసం ఒక్క గుడైనా కట్టిండా? చొప్పదండి మున్సిపాలిటీకి బండి సంజయ్ ఒక్క రూపాయైనా తెచ్చాడా? వేములవాడ గుడికైనా నిధులు తేవచ్చు కదా. డబుల్ ఇంజిన్​లో మోదీ కాశీని బాగు చేస్తే… ఇక్కడి ఇంజిన్ దక్షిణ కాశీ వేములవాడను బాగు చేయొద్దా? అని ప్ర‌శ్నించాడు.

ఎప్పటికైనా కష్టసుఖాల్లో తోడుండేది గులాబీ జెండా మాత్రమేనన్నారు. తాము ఇటీవలే కరీంనగర్​కు మెడికల్​ కాలేజీ మంజూరు చేశామన్నా ఆయన.. అన్ని జిల్లాల్లో మెడికల్​ కళాశాలలు వస్తాయన్నారు.

Related posts