telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్‌తో కలవడానికి జగన్‌కు సిగ్గుండాలి!

Minister Devineni uma fire ys jagan
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ భేటీ పై మంత్రి దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్‌తో కలవడానికి జగన్‌కు సిగ్గుండాలన్నారు.  సీఎం కేసీఆర్‌ దూషణలను ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని దేవినేని అన్నారు. ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు కూడా రావని తిట్టారని దేవినేని ఈ సందర్భగా గుర్తుచేశారు. లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షసులేనని కేసీఆర్‌ తిట్టలేదా అని ప్రశ్నించారు. తెలుగు తల్లి అంటే దెయ్యమని కేసీఆర్‌ దూషించారని  అన్నారు.  
ఆంధ్రావాళ్ల బిర్యాని పేడలా ఉంటుందని కేసీఆర్‌ అనలేదా అని మరోసారి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కక్షతో కేసీఆర్‌ నీచరాజకీయాలు చేస్తున్నారని దేవినేని ఉమ దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఏపీ వాళ్లు కిరాయిదారులే అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.  ఫెడరల్ ఫ్రంట్‌ కాదని, మోదీ ఫ్రంట్‌ అని ఎద్దేవాచేశారు. అధికారం కోసం కక్కుర్తి పడి, ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టి జగన్ కేసీఆర్ తో చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన పాదయాత్రలోనే వైసీపీకి ఏపీ ప్రజలు ముగింపు పలికారని చెప్పారు. అందుకే చివరి అస్త్రంగా ఏపీ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడానికి జగన్ పూనుకున్నారని దుయ్యబట్టారు. సుమారు రూ.5,200 కోట్ల ఏపీ విద్యుత్ ను తెలంగాణ వాడుకుందనీ, అయినా బిల్లును ఇంకా చెల్లించలేదనీ, అడిగితే దిక్కు ఉన్నచోట చెప్పుకోండి అని కేసీఆర్ చెబుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తితో కలిసి జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని  మంత్రి దేవినేని ఆరోపించారు. 

Related posts