telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మేయర్ ను ట్రక్కుకు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్ళిన ప్రజలు… ఎందుకంటే ?

Mexico

నగర వీధుల్లో ప్రజలు ఏకంగా మేయర్ నే ఈడ్చుకెళ్లి… రోడ్ల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన ఘటన మెక్సికోలో చియపాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గతుకుల రోడ్లతో ప్రమాదాలకు గురవ్వుతున్న ప్రజలు విసిగిపోయారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రోడ్లు బాగు చేయడం లేదనే కోపంతో ప్రజలు నేరుగా మేయర్‌నే నిలదీశారు. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో లాస్ మార్గరీటాస్ నగరంలో మంగళవారం కొంతమంది వ్యక్తులు మున్సిపాలిటీ ఆఫీసులోకి చొరబడ్డారు. అనంతరం మేయర్ జార్జ్ లూయిస్ ఎస్కాండన్ హెర్నాండెజ్ చాంబర్‌లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అతడిని బయటకు లాక్కొని వచ్చి, టయోటా ట్రక్కుకు కట్టేసి నగర వీధుల్లో ఈడ్చుకెళ్లారు. ఈ సందర్భంగా మేయర్ మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఒకరినొకరు కర్రలు, పైపులతో కొట్టుకున్నారు. మేయర్‌పై దాడి చేయడం ఇది రెండోసారి. నాలుగు నెలల కిందట కూడా హామీలు నెరవేర్చడం లేదనే కారణంతో మేయర్‌ను కొట్టారు. ‘Tinta Fresca Chiapas’, ‘Tabasco AI Minuto’ వార్తా వెబ్‌సైట్లు ట్విట్టర్‌లో ఈ వీడియోలను పోస్టు చేశాయి. నిరసనకారులు మేయర్ చేతులను తాళ్లతో కట్టేసి ట్రక్కుతో లాక్కెళ్లినట్లు మెక్సికో వార్తా పత్రికలు వెల్లడించాయి. పోలీసులు వారిని అడ్డుకుని మేయర్‌ను విడిపించారని పేర్కొన్నాయి. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం, అపహరణ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే రాష్ట్రంలో కొద్ది నెలల కిందట హామీలు అమలుచేయని ఎంపీలకు మహిళల దుస్తులు వేసి ఊరేగించడం గమనార్హం. మరి ఇండియాలో కూడా హామీలు నెరవేర్చని నాయకులను ఇంత ధైర్యంగా ప్రజలు ఎప్పుడు ఎదుర్కొంటారో…!

Related posts