telugu navyamedia
సినిమా వార్తలు

ఎదిగి ఒదిగిన జయశ్రీదేవి

producer nara jayasri died
రెండు రోజుల క్రితం హైద్రాబాద్ లో గుండె పోటుతో మరణించిన నారా జయశ్రీదేవి జీవితంలో చిన్న స్థాయి నుంచి ఎదిగిన మహిళ . 
నాకు మూడున్నర దశాబ్దాలుగా  పరిచయం . పరిచయం . 1984 అనుకుంటాను ఒకసారి నేను ఆంధ్ర భూమి వార పత్రిక ఎడిటర్ సి . కనకాంబరం రాజు గారిని కలవడానికి వెళ్ళాను . నా కథలు ఆంధ్ర భూమి వార పత్రికలో ప్రచురితమవుతుండేవి . నా నవల “సావేరి “ని రాజు గారు ఆంధ్ర భూమి మాస పత్రికలో ప్రచురించారు . అప్పుడు  కనకాంబర రాజు గారు మొదటిసారి జయశ్రీదేవిని పరిచయం చేశారు .  సన్నగా నాజూకుగా ,  చూడగానే  ఆత్మీయంగా అనిపించారు.  
Memories Of JayaSridevi Bhageeradha
అప్పటికే జయశ్రీదేవి ఆంధ్ర భూమి వార పత్రికలో సినిమా , రాజకీయ నాయకుల ఇంటర్వ్యూ లు ప్రచురితమవుతున్నాయి . ఆ ఇంటర్వ్యూ లు అప్పట్లో చర్చనీయాంశంగా ఉండేవి. మంత్రులు మొదలు కొని ముఖ్య మంత్రుల ఇంటర్వ్యూ లు కూడా చేసి జయశ్రీదేవి ఒక గుర్తింపు సంపాదించారు . ఎడిటర్ కనకాంబర రాజు గారు వార పత్రికల్లో ఆంధ్ర భూమిని అగ్రగామిగా నిలబెట్టారు . సహజంగానే ఆంధ్ర భూమి వార పత్రికలో వస్తే  వేలాది మంది చదివేవారు .
ఊహించని పాపులారిటీ వచ్చేది . జర్నలిస్టుగా జయశ్రీదేవి  అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ చాలామంది ప్రశంశలు అందుకుంది అప్పటి నుంచి జయశ్రీదేవి నేను అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ లోనో, సభల్లోనో  కలుస్తూ ఉండేవాళ్ళం . ఆ తరువాత జర్నలిజం నుంచి ఆమె సినిమా రంగానికి వచ్చారు . 1997లో ఒకసారి ఆమె నిర్మించిన సినిమా ప్రెస్ మీట్లో కలిసినట్టు గుర్తు . 
తెలుగు టాప్ స్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ అర్జున్ , టాప్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు , సౌందర్య , మీనాతో “శ్రీమంజునాథ ” సినిమాను కన్నడ , తెలుగు భాషల్లో నిర్మించారు .  ఈ సినిమా ప్రారంభం జులై 3, 2000 న బెంగుళూర్ కంఠీరవ స్టూడియోస్ లో వైభవంగా జరిగింది .  ఈ ప్రారంభానికి హైదరాబాద్ నుంచి జయశ్రీదేవి మీడియా మిత్రులను ఆహ్వానించారు . నేనప్పుడు ఆంధ్ర ప్రభ దినపత్రిక సినిమా పేజీ ఇంఛార్జిగా ఉండేవాడిని . 
ఆ ప్రారంభోత్సవానికి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ వారి శ్రీమతి పార్వతమ్మ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు . 
ప్రారంభం అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులతో మాట్లాడవలసిందిగా నేను రాజ్ కుమార్ గారిని అడగడం జరిగింది . ప్రక్కనే వున్నా జయశ్రీదేవి కూడా  ఓ 10 నిముషాలు వారితో మాట్లాడేది అన్నారు . దానికి రాజ్ కుమార్ గారు నవ్వుతూ “వారికి బోర్ కొట్టిందాకా మాట్లాడతాను “అన్నారు . 
Memories Of JayaSridevi Bhageeradha
రాజా కుమార్ గారు వారి శ్రీమతి పార్వతమ్మ గారితో కల్సి మీడియా మిత్రులతో మాట్లాడటానికి వచ్చారు . హైదరాబాద్ నుంచి వెళ్లిన వాళ్ళం కాబట్టి మాకెవరికీ కన్నడం రాదు . అందుకే ఇంగ్లీషులో ప్రశ్నలు అడుగుతున్నాము . రాజ్ కుమార్ గారు నవ్వి  “1954లో నేను తెలుగులో “శ్రీకాళహస్తి  మహత్యం ” అనే సినిమాలో నటించాను . రామారావు గారు , నాగేశ్వర రావు గారు ఇద్దరు నా సోదరులు ..నాకు తెలుగు కొంచం వచ్చు . మనం తెలుగులోనే మాట్లాడుకుందాం “. ఆ మాటలు మాకెంతో  సంతోశాన్ని కలిగించాయి .  అలా రాజ్ కుమార్ గారు మాతో ఒక గంటకు పైగా గడిపారు . అది వారి మంచితనానికి , నిరాడంబరానికి నిదర్శనం . అలా రాజ్  కుమార్ గారితో మాట్లాడే అవకాశం కలిగించారు జయశ్రీదేవి .
 
డిసెంబర్ 31 ,2017న హైదరాబాద్ ఫిలిం సిటీ లో జరుగుతున్న కన్నడ సినిమా “కురుక్షేత్ర ” సినిమా నిర్మాత  మునిరత్న నాయుడు గారిని కలవడానికి నేను మిత్రులు సురేష్ , సాంబశివరావు వెళ్ళాము . అక్కడ సెట్లోకి వెడదామని అనుకుంటున్నప్పుడు అక్కడ అనుకోకుండా జయశ్రీదేవి కనిపించారు . మేము అక్కడ ఉండటం ఆమెకు ఆశ్చర్యమనిపించింది . అయితే మేము వచ్చిన పని చెప్పాము . అంతకు ముందు మునిరత్నం నాయుడు గారితో ఫోన్లో మాట్లాడాము తప్ప ఆయన్ని వ్యక్తిగతంగా కలవలేదు . జయశ్రీదేవి నాయుడు గారి దగ్గరకు తీసుకెళ్లి నన్ను పరిచయం చేసింది . నా గురించి గొప్పగా చెప్పింది . మా అందరికీ వారంటే చాలా గౌరవం అన్నది . “కురుక్షేత్ర ” చాలా భారీ బడ్జెట్ మూవీ.  ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలు అన్నీ జయశ్రీదేవి గారే చూస్తున్నారు అని నాయుడు గారు చెప్పారు . 
చివరి సారిగా జయశ్రీదేవిని డిసెంబర్లో అనుకుంటాను ఫిలిం నగర్ క్లబ్ కు వచ్చారు  . కూతురు , మానవరాలుతో వచ్చారు . కూతురును ఫిలిం నగర్ క్లబ్ లో సభ్యురాలుగా చేర్పిద్దామని వచ్చాను అన్నారు . అయితే అధ్యక్షుడు నారాయణ గారితో మాట్లాడతాను  అని చెప్పాను . ఆ రోజు నారాయణ గారు క్లబ్ కు రాలేదు . ” మీరు మాట్లాడి చెప్పండి , నేను అమ్మాయిని తీసుకొని వస్తాను “అన్నారు . రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మరణించారని వార్త విన్నాను. .
జయశ్రీదేవి ఛాయా కస్టపడి పైకి వచ్చారు , జర్నలిస్టుగా తనదైన ముద్ర వేశారు . నిర్మాత గా కూడా శ్రీమంజునాథ, ఆది శంకరాచార్య , వందేమాతరం, చంద్ర వంశం లాంటి సినిమాలు .తీశారు . కన్నడంలో టాప్ స్టార్స్ సినిమాలు నిర్మించారు . కన్నడ నాట ఆమెకు మంచి పేరుంది . అక్కడే స్థిరపడ్డారు . చివరికి ఆ మట్టిలోనే మమేకమై పోయారు . 
నారా జయశ్రీదేవి ఇక ఓ మధుర జ్ఞాపకం . 
-భగీరథ 

Related posts