telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో బీజేపీ “ఆపరేషన్ ఆకర్ష్”.. కమలం పార్టీలోకి  మెగాస్టార్..? 

chiranjeevi meghastar

 ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ జోరుగా సాగుతోంది. వచ్చే  అసెంబ్లీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీనీ బలోపేతం చేసేందుకు బీజేపీ హై కమాండ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు  బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.  టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కూడా నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  తెలుగుదేశం పార్టీ బలాన్ని తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన బిజెపి అధిష్టానం రాష్ట్రంలో పాగా వేయడానికి గాను సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుంది. అందులో భాగంగానే తెలుగుదేశం ఎంపీలు నలుగురు ఇటీవల  బీజేపీ కండువా కప్పుకున్నారు.

సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఇప్పటికే  బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు. ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో కొంత మంది కీలక నేతలు పార్టీలోకి వెళ్లడానికి  సిద్దమవుతున్నారు. అలాగే రాయలసీమకు చెందిన పెద్ద కుటుంబాలని సైతం పార్టీ మార్చటానికి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బిజెపి నేతలు వారితో చర్చలు కూడా జరుపుతున్నారు. 

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి  బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చిరంజీవితో సోమవారం రాత్రి  బీజేపీ కాపు సామాజిక వర్గ నేతలు భేటి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో పార్టీలో ఉన్నా సరే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కి ప్రచారం చేయలేదు. ఏప్రిల్ 2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. 

ఇక గత కొంత కాలంగా సినిమాల మీద దృష్టి సారించిన ఆయన ప్రస్తుతం “సైరా న‌ర‌సింహారెడ్డి” చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపధ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని ఆయన అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్  బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం  భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. 

Related posts