telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ చిత్రాన్ని నా తనయుడు నిర్మించినందుకు గర్వపడుతున్నా… : చిరంజీవి

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ నటీనటులపై, సాంకేతిక నిపుణులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్సకులకు థ్యాంక్స్ తెలిపేందుకు చిత్రయూనిట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “ఓ స్వతంత్ర సమరయోధుడి కథతో సినిమా చేయాలని, అది నా కెరీర్‌లో నిలిచిపోయేలా ఉండాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. 12 ఏళ్ల క్రితం పరుచూరి సోదరులు చెప్సిన ‘సైరా’ కథ నాకు బాగా నచ్చింది. కానీ, ఇలాంటి కథని కాంప్రమైజ్‌ అయి తీస్తే కథకు న్యాయం చేయలేం. 150వ సినిమా తర్వాత ఈ కథతో రావాలని రెండున్నర సంవత్సరాలుగా మేమంతా కష్టపడి ‘సైరా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఇప్పటివరకూ చిరంజీవి నటించిన 150 సినిమాలు ఒక ఎత్తు ‘సైరా నరసింహారెడ్డి’ మరొక ఎత్తు’ అని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి యోధుడి గురించి ఎన్ని కథలు, పుస్తకాలు వచ్చినా ఎక్కువమందికి తెలియాలంటే సినిమా ఒకటే సరైన మాధ్యమం. ఈ రోజు భారతీయులందరికీ నరసింహారెడ్డి గురించి తెలుస్తోంది. ఒకటో తేదీన ముంబైలో ప్రీమియర్‌ షో వేేస్త అక్కడి విలేకరులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఉత్తరాది, దక్షిణాది సినిమా అని చూడకుండా భారతీయ సినిమాగా ‘సైరా’ గుర్తింపు పొందింది. ఇలాంటి చిత్రాన్ని నా తనయుడు నిర్మించినందుకు గర్వపడుతున్నా. ‘ధ్రువ’ చూడగానే సురేందర్‌రెడ్డి ఈ కథకు న్యాయం చేస్తాడనిపించింది. ఆయనపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక ఎపిక్‌లాంటి సినిమా ఇచ్చాడు. స్నేహానికి అమితాబ్‌ ఎంత విలువ ఇస్తారో ఈ సినిమాతో తెలిసింది. ఆయన రుణం నిజంగా తీర్చుకోలేనిది. సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుబ్బయ్య పాత్ర చేసిన సాయిచంద్‌ ఇలా ప్రతి ఒక్కరూ మంచి కథలో భాగమవ్వాలని నటించారు. తమన్నా పాత్ర ప్రతి ఒక్కరినీ కదలించింది. సిద్ధమ్మగా నయనతార ఒదిగిపోయారు. ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా అనుష్క మెప్పించారు. అమెరికా నుంచి వచ్చి ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారామె. ఇక రత్నవేలు కెమెరా పనితనం నన్ను 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిందని అంతా మెచ్చుకుంటున్నారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ ఆనాటి పరిస్థితులను చక్కగా అధ్యయనం చేసి పునః సృష్టించారు. 3800 షాట్స్‌తో వీఎ్‌ఫఎక్స్‌ అద్భుతంగా వచ్చాయంటే అందుకు కమల్‌ కణ్ణన్‌ కారణం. బుర్రా సాయిమాధవ్‌ మాటలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. సత్యానంద్‌ సలహాలు సినిమాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ‘సైరా’ చరిత్రలో గుర్తుండిపోయే సినిమా’’ అని అన్నారు. 

Related posts