telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు.. ఒకే వేదికపై మాయావతి, ములాయం..

mayavati and mulayam shares single stage

24 ఏళ్లుగా ఎడతెగని రాజకీయ శత్రుత్వం, ఒకరి ముఖం మరొకరు కూడా చూసుకోనంతటి ద్వేషం. అలాంటి బద్ద శత్రువులు మళ్లీ ఒక్కటయ్యారు. ఒకే వేదికపై కనిపించి దరహాసం చిందించారు. గతం మరిచిపోయారు.. వర్తమానంపై దృష్టి పెట్టారు. వారెవరో కాదు ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి. రాజకీయాల్లో అసాధ్యమంటూ ఏదీ ఉండదు అనడానికి వీరిద్దరి మధ్య మళ్లీ చిగురించిన దోస్తానా పెద్ద ఉదహరణ. 1995లో మాయావతితో పాటు బీఎస్పీ కార్యకర్తలపై సమాజ్ వాదీ పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక అప్పటినుంచి ఇరు పార్టీల అధినేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. అలా రెండు దశాబ్ధాల నుంచి వారి మధ్య మాటల్లేవు. కానీ 24 ఏళ్లు కలలా గడిచిపోయాయి. లోక్ సభ ఎన్నికల పుణ్యమా అని తిరిగి ఈ ఇద్దరు రాజకీయ ఉద్ధండులు మళ్లీ ఒక్కటయ్యారు.

మైన్‌పురి క్రిస్టియన్ ఫీల్డ్ మైదానం ఎస్పీ చీఫ్, బీఎస్పీ అధినేత రాకతో కళకళలాడింది. ఇన్ని ఏళ్ల తర్వాత ఇద్దరు అగ్రనేతలు ఒకే వేదికపై దర్శనమివ్వడంతో.. ఇరు పార్టీల కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ములాయం, మాయావతి కలిసి అభివాదం చేయడంతో పెద్దపెట్టున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మైన్‌పురి లోక్ సభ సెగ్మెంట్ నుంచి ములాయం పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం (19.04.2019) నాడు ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ములాయం, మాయావతితో పాటు ఆర్‌ఎల్డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ కూడా సభలో పాల్గొన్నారు.

ములాయం సింగ్ సభా వేదికపై కాస్తా భావోద్వేగానికి గురయ్యారు. రెండు దశాబ్ధాల తరువాత మాయావతితో కలిసి ఇలా ప్రజల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇకనుంచి సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు బీఎస్పీ అధినేత్రి మాయావతిని గౌరవించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సభాముఖంగా కోరారు. ఈ వేదికపై మాయావతి మాట్లాడుతూ.. మైన్‌పురి నుంచి ములాయం సింగ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాలు ములాయంను తమ నేతగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి సమర్థులెవరో, అసమర్థులెవరో తెలుసుకుని ఓటేయాలన్నారు. అఖిలేష్ యాదవ్.. ములాయంకు అసలు సిసలు వారసుడని కితాబిచ్చారు. దేశ భవిష్యత్తు కోసమే ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయని స్పష్టం చేసిన మాయావతి.. ప్రధాని మోడీ నాటకాలు ఈసారి ఎన్నికల్లో పనిచేయవని ఎద్దేవా చేశారు.

అఖిలేశ్ యాదవ్ సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దేశానికి నూతన ప్రధాని అవసరం ఎంతో ఉందని.. దానికి మైన్‌పురి నుంచే అడుగులు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి నుంచి కొత్త ప్రధాని కల సాకారమవుతుందని చెప్పుకొచ్చారు. వ్యవస్థలన్నింటినీ ప్రధాని మోడీ నిర్వీర్యం చేశారని.. దేశంలో బీజేపీని తుడిచిపెట్టడానికే తామంతా కూటమిగా ఏర్పడ్డామని అన్నారు.

Related posts